
ప్రజాశక్తి - కాళ్ల
కాళ్ల మాజీ ఎంపిపి కందుల వెంకట మల్లికార్జునరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి బొండాడ మాజీ సర్పంచి నాగమణి(59) అనా రోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆమె మృతితో మల్లికార్జునరావు నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విచ్చేసి ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లికార్జునరావుకు టిటిడి బోర్డు మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, వైసిపి నాయకులు గాదిరాజు సుబ్బరాజు, మన్నే నాగరాజు, అభిరుచి కాశీరాజు, టిడిపి నాయకులు తోట ఫణిబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2013లో బిసి మహిళకు రిజర్వు కావడంతో నాగమణి గ్రామ సర్పంచిగా పోటీ చేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించలేదని కోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల తర్వాత హైకోర్టు నుంచి తీర్పు రావడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా 12 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. దీంతో సర్పంచిగా రెండేళ్ల పాటు పని చేశారు. ఆమె పదవి కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.