ప్రజాశక్తి-చీరాల: మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం పాముకాటుకు గురయ్యాడు. ఆమంచి వర్గీయులు తెలిపిన వివరాల ప్రకా రం.. వేటపాలెం మండలం పందిళ్లపల్లి లోని రొయ్యల చెరువుల వద్ద సోమవారం రాత్రి వాకింగ్ చేస్తుండగా చెట్లపొదల్లో నుంచి పాము ఒక్కసారిగా వచ్చి కరవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిస్థితి గమనించిన ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వెంటనే ఆయన వాహనంలోనే శరవేగంతో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆపాటికి సమాచారం అందుకున్న చీరాల ప్రాంతంలోని ప్రముఖ వైద్యులు వైద్యశాల వద్దకు చేరుకొని ప్రభుత్వ వైద్యులుతో కలిసి ప్రత్యేక చికిత్సలు అందించారు. దీంతో వైద్యులు సిబ్బంది కలిసి కృష్ణమోహన్‌కు పాముకాటుకు విరుగుడు చికిత్సను అందించారు. ఆపాటికి ఆయన పరిస్థితి మెరుగుపడగా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యసేవల కోసం ఆమంచిని విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణమోహన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమంచి అనుచరులు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.










