ఈ విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలలో 'ఇంగ్లీష్ మీడియం' తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ (యు.జి) స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం గ్రాడ్యుయేట్ల కెరీర్ అవకాశాలను మెరుగు పరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ''గట్టిగా భావిస్తున్నది''. కానీ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం మాధ్యమం మార్చడం శ్రేయస్కరం కాదు. విద్య మానవ వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. అంతేకాని విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి కాకూడదు. విద్య వ్యాపారమయం అయినప్పుడు ఇలాంటి భావనలు ప్రభుత్వాలకు రావడం సర్వసాధారణం. మాధ్యమం మార్చినంత మాత్రాన విద్య ప్రమాణాలు పెరుగుతాయనుకుంటే ప్రభుత్వం పప్పులో కాలేసినట్లే. గత 15 సంవత్సరాలుగా నియామకాలు లేక విశ్వవిద్యాలయాలు మూసివేతకు దగ్గరలో ఉన్నాయి. నలభై సంవత్సరాల కిందట వెలసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం లోనే ఆంగ్ల విద్యను బోధించడానికి అధ్యాపకులు లేరు. ఇక కొత్తగా వెలసిన రాయలసీమ, ఆదికవి నన్నయ, యోగి వేమన, విక్రమ్ సింహపురి చివరకు జె.ఎన్.టి.యు లలో కేవలం ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు. అధ్యాపకులను నియమించకుండా... కేవలం మాధ్యమాలు మారిస్తే విద్యా వ్వవస్థ ప్రమాదంలో పడుతుంది. సాంకేతిక, సంక్లిష్ట విషయాలు మాతృభాషలో బోధించినప్పుడే పిల్లలకు అర్థమవుతాయి. సి.నారాయణ రెడ్డి గారు తన 'ప్రపంచ పదులు' లో అన్నట్లు 'విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణిత మతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే. పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం చేరేది ఎలా?'. సాంకేతిక విద్య ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని దాదాపు 600 పైచిలుకు ఇంజినీరింగ్ కళాశాలలకు 2001లో శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో 280 ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. వందకు పైగా కళాశాలల్లో కేవలం 40 మంది విద్యార్థులు చేరారు. అంటే కళాశాలల పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2005లో ఎం.సి.ఏ కోర్సులో 28 వేల సీట్లు, ఎం.బి.ఏ లో 32 వేల సీట్లు ఉండేవి. ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్ చదివే వారే లేరు. ఇక ఎం.బి.ఏ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి కళాశాలల్లో శ్మశాన ప్రశాంతత నెలకొంది. ఇక బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బి.బి.ఏ కోర్సులు ఎప్పుడో మూత పడ్డాయి. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, బి.కామ్ కంప్యూ టర్స్, బయో కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ చదివేవారు కరువయ్యారు. చాలామంది అధ్యాపకులు రిటైర్ కావడంతో విశ్వవిద్యాలయాల్లో కేవలం 30 మంది అధ్యాపకులకు మించి ఉన్న విశ్వవిద్యాలయాలు కేవలం తొమ్మిది. చాలా చోట్ల అధ్యాపకుల సంఖ్య ఇరవై లోపే. ఇప్పటికైనా ప్రభుత్వం లోపం ఎక్కడుందో గ్రహిస్తే ప్రజలకు మేలు చేసినవారవుతారు. తక్షణమే విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ కళాశాలల్లో నియామకాలు చేపట్టి అన్ని శాఖలను అభివృద్ధి పరచాలి.
డా|| ముచ్చుకోట సురేష్ బాబు, ప్రజా సైన్సు వేదిక రాష్ట్ర అధ్యక్షులు.










