Dec 27,2022 23:53

కలిగొట్లతో ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఆయన గ్రూపు నాయకులు

ప్రజాశక్తి- దేవరాపల్లి
ఒకే పార్టీ.. ఒకే నినాదం.. ఒకే కార్యక్రమం.. అయితే వేర్వేరుగా కార్యక్రమాలు. మాడుగుల టిడిపిలో నేతల మధ్య ఉన్న విబేధాలు మరో సారి బయటపడ్డాయి. దీంతో టిడిపి కేడర్‌లో అయోమయం నెలకొంది. మాడుగుల టిడిపిలో ఇదేం కర్మరా బాబూ అంటూ సొంత పార్టీ శ్రేణులే నాయకుల తీరుపై మండిపడుతున్నారు. అంతా కలిసి పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులే ఎడముఖం, పెడ ముఖంతో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీకి తలవంపులు తెస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
'ఇదేమి కర్మ మన రాష్ట్రానికి' అనే నినాదంతో టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఆయన పిలుపు మేరకు నియోజకవర్గంలో ఇప్పటికే పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దేవరాపల్లి మండలం కలిగోట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే రోజు మండలంలోని బి.కింతాడ గ్రామంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌, సీనియర్‌ నాయకులు పైలా ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది. దీంతో కలిగొట్లలో ఈ కార్యక్రమాన్ని కలిసి చేద్దామని పివిజి.కుమార్‌ సూచించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఆయన గ్రూపు నాయకులు నిరాకరించారు. దీంతో కలిగొట్లతో సోమవారం రాత్రి రెండు గ్రూపులు వేర్వేరుగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేక కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఒకపక్క వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకులు, వారిలో వారే విబేధించుకుంటూ కేడర్‌ ముందు చులకన అవుతున్నారు. ఇటీవల ఐక్యతా రాగం వినిపించి మాడుగుల కోటపై టిడిపి జెండాను ఎగురవేస్తామని ప్రకటించడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. ఇందులో భాగంగా నియోజకవర్గం ఇన్‌ఛార్జి కుమార్‌తో కలిసి సీనియర్‌ నాయకులు పైలా ప్రసాదరావు కార్యక్రమాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి, ఆయన గ్రూపు మాత్రం అందుకు సిద్ధంగా లేనట్లు సోమవారం నాటి సంఘటన తేటతెల్లం చేస్తుంది. దీంతో సొంత పార్టీ కార్యకర్తలే ఇంక వీరు మారరు.. అంతే సంగతులు అంటూ అక్కడే గుసగుసలాడుకోవడం కనిపించింది. ముందు ముందు మాడుగుల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.