Mar 17,2023 00:33
మాట్లాడుతున్న డిఎస్‌పి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉంటేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్షణికమైన అనుభూతుల కోసం మత్తు పదార్థాలను ఆశ్రయిస్తే జీవితమే చీకటిమయం అవుతుందని బాపట్ల డీఎస్పీ ఎ శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండల కేంద్రం మార్టూరులో దుర్గా మల్లేశ్వర కల్యాణ మండపంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎస్పీ మాట్లాడారు. మాదక ద్రవ్యాలను అరికట్టడమే సంకల్పంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల ఎస్పీలు సంయుక్తంగా డ్రగ్స్‌కి వ్యతిరేకంగా సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో వేళ్లూనుకుపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి విద్యాసంస్థల యజమానులు డ్రగ్స్‌ నిర్మూలన కమిటీని ఏర్పాటు చేసి తమ పరిధిలోని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి బాపట్ల జిల్లాను గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి కృషి చేయాలని డిఎస్పీ కోరారు. అనంతరం మార్టూరు సీఐ షేక్‌ థెరిసా ఫిరోజ్‌ డ్రగ్స్‌ వినియోగం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు, డ్రగ్స్‌ తీసుకుంటే తీసుకునే చట్టపరమైన చర్యలు, మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి ఎలా బయట పడాలి వంటి అంశాల గురించి విద్యార్థులకు డిజిటల్‌ బోర్డు ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు, మార్టూరు ఎస్‌ఐలు చెంచు ప్రసాద్‌ కోడూరు కమలాకర్‌, మార్టూరు శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ గడ్డం ఆంజనేయులు, విఎస్‌ఆర్‌ఎఎమ్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రావి అంకమ్మ చౌదరి, పర్చూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహారావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.