పజాశక్తి-పంగులూరు: 'మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.. వాటిని అరికడదాం.. మాదక ద్రవ్యాల పట్ల యువతకు అవగాహన కలిగించి, చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదాం'' అంటూ రేణింగవరం ఎస్‌ఐ ముప్పవరంలో హైస్కూల్ విద్యార్థుల చేత సోమవారం ప్రమాణం చేయించారు. ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మండలంలోని ముప్పవరం పాటిబండ్ల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాలలో, ఎస్‌ఐ తిరుపతిరావు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రమాణం చేయించారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వలన యువత చెడుమార్గాల వైపు పయనిస్తుందని, దీనివలన వారి జీవితాలు నాశనం అవటంతో పాటు, దేశ సంస్కతి సాంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ కూడా సర్వనాశనం అవుతుందని ఎస్‌ఐ తిరుపతి రావు అన్నారు. అనేకమంది విద్యార్థులు మాదక ద్రవ్యాల వల్ల బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, భారత పౌరులుగా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అందుకు యువతలో అవగాహన కల్పించి భారతదేశాన్ని మాదక ద్రవ్యాల నిర్మూలన దేశంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఆయన కోరారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. మండలంలో ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు సమాచారం వచ్చినా, రవాణా చేసిన సమాచారం వచ్చినా, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి మీద పీడి యాక్టు ఓపెన్ చేసి సెంట్రల్ జైలుకు పంపిస్తామని ఎస్‌ఐ తిరుపతిరావు హెచ్చరించారు. ప్రజలంతా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వీటి గురించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










