ప్రజాశక్తి-పంగులూరు: మాదకద్రవ్యాల వినియోగాన్ని యువత వ్యతిరేకిం చాలని, దానిని అరికట్టి సరైన మార్గంలో యువత నడవాలని, రేణిం గవరం ఎస్‌ఐ కేకే తిరుపతిరావు కోరారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, గురువారం మం డలంలోని అలవలపాడు గ్రామంలో విలేజ్ విజిటింగ్ కార్యక్రమంలో భాగంగా యువకులతో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల, మాదకద్రవ్యాల వినియోగం పట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే అనేక సమస్యలకు గురవుతారని అన్నారు. యువకులు చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేస్తూ, భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలకు యువత బలివుతుందని, కొంతమంది యువతను తప్పుదారి పట్టించేందుకు, మారకద్రవ్యాలను ఉపయోగించే విధంగా చేస్తున్నారని తిరుపతి రావు అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా యువత ఉండాలని, నేరాలకు, మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడకూడదని చెప్పారు. నేరాల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలు, వాటి ప్రాముఖ్యతను గురించి ఎస్‌ఐ వివరించారు. అలవలపాడు గ్రామంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాలను గుర్తించినట్లు ఎస్‌ఐ తిరుపతిరావు తెలిపారు.










