మాదకద్రవ్యాల రవాణాపై నిఘా
కలెక్టర్ హిమాన్షు శుక్లా
ప్రజాశక్తి - అమలాపురం
మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని, మాదక ద్రవ్యాల వినయోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌పి ఎస్.శ్రీధర్, అడిషనల్ ఎస్‌పి ఖాదర్ బాషా, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్ శివశంకర్‌ప్రసాద్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ కెవి.భూపేష్, ఐబిడిఎస్‌పి ఎన్.కనకరాజు, ఐసిడిఎస్ పీడీ జివి.సత్యవాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎస్‌పి శ్రీధర్ మాట్లాడారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు 10 గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయన్నారు. రూ.11.36 లక్షల విలువైన 376 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలను వినియోగించడం వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లను జులై నెలలో నిర్వహించామన్నారు. పోలీస్ అధికారులు గంజా రవాణా, పెడలింగ్, వినియోగించే వారిపై నిఘా పెంచారన్నారు. దీని వల్ల జిల్లాలో గంజాయి వినియోగం తగ్తిందన్నారు. గంజాయికి బానిసైనవారు సింథటిక్ డ్రగ్స్ ఉపయోగించే అవకాశం ఉందని, సంబంధిత డ్రగ్ కంట్రోల్ అధికారులు జిల్లాలోని మెడికల్ షాపులపై నిఘా ఉంచాలన్నారు. కచ్చితమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీలు మందులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాహనాల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలిందన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం తో పాటు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించాలన్నారు. బానిసలను గుర్తించడం, చికిత్స అందించడం, పునరావాసం కల్పించడం ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టవచ్చన్నారు. జిల్లాలో గంజాయి వినియోగాన్ని అరికట్టడంలో పోలీస్ శాఖ పని తీరు ప్రశంసనీయమన్నారు. జొన్నాడ, యానాం ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వాహనాలపై ఎక్కువగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్లో రాత్రి సమయంలో వార్డెన్లు హాస్టల్స్‌లో ఉండటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే విద్యార్థులు డ్రగ్స్ అలవాటు చేసుకునే అవకాశం ఉందని, వెల్ఫేర్ అధికారులు జిల్లాలోని హాస్టల్స్‌ని రాత్రిపూట సందర్శించాలన్నారు. డ్వాక్రా సంఘ మహిళలకు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని డిఆర్‌డిఎ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశారని స్కూళ్లలో కూడా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులను చేర్చుతూ యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటయ్యేలా చూడాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రలితాలను వివరిస్తూ షార్ట్ ఫిల్ములు తయారు చేసి సినిమా హాళ్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యాసంస్థలు ఉండే ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం వలన కలిగే ఫలితాలను వివరిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్‌కు ఆమోదం లభించిందని వారం రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.










