Jul 26,2023 00:45
జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో జరిగింది. మాదక ద్రవ్యాలు నిరోధానికి డికారు ఆపరేషన్‌ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ చెప్పారు. గడచిన మూడు నెలలలో 14 గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ పని చేస్తోందన్నారు. కమిటీ పరిధిలో 14 బృందాలు జిల్లాలో డికారు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా ఏర్పడిన నాటి నుంచి 96 గంజాయి కేసులు నమోదు కాగా, 2,728 కిలోల గంజాయిని ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసుల్లో 339 మందిని అరెస్టు చేశామని, 143 మందిపై ఎస్‌జి షీట్లు నమోదు అయ్యాయన్నారు. మరో ఐదుగురిపై పిడి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాపట్ల, చీరాలలో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, కూలీలు, గ్రానైట్‌ ఫ్యాక్టరీల వద్ద పనిచేసే కూలీలు గంజాయిని వినియోగిస్తున్నారని చెప్పారు. అలాగే విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని జిల్లా అదనపు ఎస్పీ పి మహేష్‌ కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలోకి ప్రవేశించే రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ కొరియర్‌ సర్వీసులపై నిఘా ఉంచాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల బ్యాగులు, సంచుల తనిఖీ కోసం పోలీసులను నియమించాలన్నారు. జాతీయ రహదారి గుండా వివిధ వాహనాలలో గంజాయి రవాణా చేస్తున్నారని, మార్టూరు టోల్‌ గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక స్కానర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పి మహేష్‌, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, బాపట్ల, చీరాల ఆర్డీవోలు జి రవీందర్‌, పి సరోజిని, సెబ్‌ అదనపు ఎస్పీ జి నరసింహారావు, కమిటీలోని అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.