Sep 05,2023 18:02

    నూజివీడు రూరల్‌ : నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో నుజివీడు మండలం తూర్పు దిగవల్లి, గొల్లపల్లి రెండు గ్రామాల్లోని పిహెచ్‌సిలలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై వర్క్‌షాప్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్‌ బాల భవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గోళ్లమూడి శేఖర్‌ బాబు మాట్లాడుతూ మత్తు పదార్థాలు విద్యార్థుల జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తాయన్నారు. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారని, మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ, విలువైన శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలియజేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ముందుగా గుర్తించి, సరైన అవగాహనా, కౌన్సెలింగ్‌, డి అడిక్షన్‌ సెంటర్లకు పంపించాలన్నారు. ప్రతిఒక్కరూ తమ వంతు భాద్యతగా తీసుకొని పనిచేయాలని కోరారు. వీరిని డీ-ఎడిక్షన్‌ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చని, నూజివీడు మండలం పొలసానిపల్లిలో ఈ చికిత్స అందించేందుకు 'నవజీవన్‌ బాల భవన్‌ ఏర్పాటు చేసిన బోస్కో డీ-ఎడిక్షన్‌ సెంటర్‌ ఉన్నాయన్నారు. ఈలాంటి సమస్యలతో ఉన్న విద్యార్థులు, యువత ఈ క్రింది ఫోన్‌ నంబర్‌ 9490492020కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు దిగవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ బి.రవి, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.