Apr 07,2023 00:51
మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, చిత్రంలో ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం కలెక్టర్‌ ఛాంబర్లో జరిగింది. నిషేధిత మాదక ద్రవ్యాలకు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ చెప్పారు. ఇటీవల మార్టూరు మండలంలో ఓ ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కలు సాగుచేస్తూ పట్టుబడటంపై కలెక్టర్‌ ఆరా తీశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గడిచిన మూడు నెలల్లో బాపట్ల జిల్లాలో 58 కేసులు నమోదు కావడంపై క్షుణ్ణంగా సమీక్షించారు. పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాల దిగుమతిని అరికట్టాలన్నారు. స్టువర్టుపురం, చీరాల శివారు ప్రాంతాలు, మార్టూరు సమీపంలో మాదకద్రవ్యాలు విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు ఎస్‌పి.. కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్‌ పలు అంశాలపై చర్చించారు. జాతీయ రహదారిని ఆధారం చేసుకొని అక్రమంగా దిగుమతి చేస్తున్న మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని ఎస్‌పిని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్‌టిసి, రైల్వే ద్వారా బాపట్లకు ఎగుమతి, దిగుమతి అయ్యే పార్శిల్స్‌ను పరిశీలించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రజలపై నిఘా ఉంచాలన్నారు. విశాఖ జిల్లా నుంచి బాపట్ల జిల్లాలోకి ప్రవేశించే ఆర్‌టిసి బస్సులపై నిఘా ఉంచాలని, ఇతర వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని అన్నారు. ఆర్‌టిసి డిపో పార్శిళ్ల వద్ద, టోల్‌గేట్ల వద్ద స్కానర్లు ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్‌ షాపులలో ఔషధాల అమ్మకాలపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్‌ విక్రయాలపై ప్రత్యేక పరిశీలన చేయాలని అధికారులకు ఆమె మార్గనిర్దేశం చేశారు.
ప్రతి పాఠశాల, కళాశాలల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. మాదక ద్రవ్యాల నిషేధంపై బాపట్ల జిల్లాలోని 70 కళాశాలలు, 10 ప్రభుత్వ సంక్షేమ కళాశాలల వసతి గృహాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వైపు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ విస్తతంగా చైతన్యం తీసుకురావాలన్నారు. కళాశాలల వద్ద హౌర్డింగులు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాపట్లలో డి-ఎడిక్షిన్‌ కేంద్రాలు, కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపామని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఇప్పటికే స్టువర్టుపురం, మార్టూరు, చీరాల, రేపల్లె ప్రాంతాలపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఏఎస్‌పి మహేష్‌, ఆర్‌డిఓలు జి రవీందర్‌, పి సరోజిని, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి రాజదెబొరా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, వ్యవసాయ శాఖ అధికారి షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, డిఇఓ పివి రామారావు, ఆర్‌టిసి ఆర్‌ఎమ్‌ రామారావు, సెబ్‌ ప్రత్యేక అధికారి నరసింహారావు తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.