Oct 01,2021 06:46

ఉత్సాహం ఉరకలు వేసే యువతతో పటిష్టమైన దేశాన్ని నిర్మిస్తామంటూనే ... వారిని నిర్వీర్యం చేసే మాదకద్రవ్య వ్యాపారాన్ని కట్టడి చేసే చర్యలకు అణుమాత్రం కదలడం లేదు బిజెపి ప్రభుత్వం. మత్తుకు బానిసలైన యువత... పేదరికం, నిరుద్యోగం, పెరిగిన ధరలు... వేటినీ పట్టించుకోలేని విధంగా తయారౌతుంది. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లోనూ వ్యాపారులకు లాభాలు వచ్చిపడుతుంటాయి. పాలకులను ప్రశ్నించే వారూ తగ్గిపోతారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందంగా లేదూ!
    ఇటీవల గుజరాత్‌ లోని ముంద్రా పోర్టులో రూ. 21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టుబడడంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, మాదక ద్రవ్యాల రవాణాను, వాడకాన్ని అరికట్టేందుకు కృషి చేయాల్సిన కేంద్రం మాత్రం కదలడం లేదు. ఎందుకని?
 

అసలు దోషులేరి ?
గుజరాత్‌లో అదానీ పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. ఆ సందర్భంగా తనిఖీలు నిర్వహించగా ఢిల్లీ, నోయిడాలో కూడా పట్టుబడింది. దీనికి సరిగ్గా నెల రోజుల ముందు ముంబాయిలో రూ. 1800 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ 300 కిలోలు దొరికింది. దానికి ముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 121 కోట్లు విలువ చేసే సరుకు దొరికింది. అసోంలో రూ. 163 కోట్ల విలువ చేసే సరుకు దొరికింది. తాజాగా లఖనవ్‌ పూర్‌లో 972 కిలోల గంజాయి దొరికింది. ఇవే కాకుండా గత ఆరు నెలల్లో తెలంగాణలో 4200 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖపట్నంలో అయితే సంవత్సరానికి రూ. 7200 కోట్ల మేర గంజాయి వ్యాపారం జరుగుతున్నదని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నా అసలు దోషులెవరన్నది బైటకి రాదు. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నట్లు పై స్థాయి వారి అండ లేకుండా ఇదంతా సాధ్యం కాదు! అందుకే ప్రైవేటు పోర్టుల నిర్వహణ మాత్రమే మా బాధ్యత, రక్షణ, తనిఖీలు మా బాధ్యత కాదని యాజమాన్యాలు తప్పుకుంటున్నా...ప్రభుత్వాలు వాటిని ఒక్క మాట అనవు. అసలు మాఫియా డాన్‌లను వదిలేసి చిన్న చితక వారిని అరెస్టులు చేసి, చేతులు దులుపుకుంటున్నాయి.
 

వాడుక పెరిగిపోతోంది
ప్రపంచ వ్యాప్తంగా 269 మిలియన్ల మంది మాదక ద్య్రవాలకు బానిసలయ్యారు. వీరు కాకుండా ఒక్కసారైనా వాడుతున్నవారు 5.5 శాతం మంది వున్నారు. ఇండియాలో అయితే మద్యం 16 కోట్ల మంది, గంజాయి 3.1 కోట్ల మంది, హెరాయిన్‌ 2.8 కోట్ల మంది, కొకైన్‌ ఇతర మత్తు పదార్థాలు 1.18 కోట్ల మంది వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2004లో 21 శాతం వాడుతుంటే ఇప్పుడది 29.5 శాతానికి పెరిగిందని 2020లో ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం మాదకద్రవ్యాల వాడకం వలన ప్రపంచవ్యాప్తంగా అర మిలియన్‌ మంది 2019లో మరణిస్తే.... ఇండియాలో జరిగిన ఆత్మహత్యల్లో అధిక శాతం ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు 0.71 శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియాలో 2.65 శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. 1985లో నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు వాడడం, కలిగి ఉండడం, సరఫరా, ఉత్పత్తి చట్టరీత్యా నేరం. అయినా ఈరోజు మన దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దొరుకుతూనే ఉన్నాయి. వాడకం పెరుగుతూనే ఉంది. ఇంతటి ప్రమాదకరమైన సమస్య రోజురోజుకు తీవ్రమౌతున్నప్పటికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి తప్ప పరిష్కారం దిశగా కదలడంలేదు.
 

లాభాలే పరమావధి
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల్లో గంజాయి సాగు అవుతున్నది. ఇండియా నివేదిక ప్రకారం దేశంలో 272 రాష్టాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ పోర్టులు, ప్రైవేటు పరం అయిన పోర్టుల ద్వారా ఈ సరఫరా ఎక్కువగా జరుగుతున్నది. ముంద్రా అయినా, దానితో సంబంధాలు ఉన్నాయని వస్తున్న క్రిష్ణపట్నం పోర్టు అయినా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అయినా, ముంబయిలో పట్టుబడినది అయినా ఇవన్నీ ప్రైవేటు పోర్టులు కావడం గమనార్హం. ఈ మహమ్మారికి బలైపోతున్న దేశాలు కూడా అత్యంత పేదరికంతో ఉన్న ఆఫ్రికా దేశాలు. ఆ తరువాత ఆసియా దేశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసే ఇండియా లాంటి దేశాలలో ఈ వ్యాపారం విస్తరిస్తున్నది. 2030 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారం 11 శాతం పెరగబోతున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. ఆకలి, దారిద్య్రం, పేదరికం, నిరుద్యోగం, వైద్యం అందకపోవడం వంటి సకల బాధలకు గురవుతున్న ప్రజానీకాన్ని సైతం విడిచిపెట్టకుండా...పెట్టుబడిదారులు మాదకద్రవ్యాల వ్యాపారంతో దోచుకుంటున్నారు. వారి నుంచి పైసలు పిండుకునేందుకు డ్రగ్స్‌ను వెదజల్లుతున్నారు. మత్తుకు బానిసలైన యువత ఎలాగైనా సరే డబ్బు పోగుచేసి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు చైనాకు నల్లమందు తయారుచేసి అమ్మి సొమ్ము చేసుకున్న వారు ఇవాళ మన దేశంలో గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో పెట్టుబడిదారులుగా వెలుగొందుతున్నారు. వీరికి లాభాలే ప్రధానం. ప్రభుత్వాలు సైతం వీరికి అండదండలనిస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ ఇదే చూశాం. ఉచిత వ్యాక్సిన్‌ అందించి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన వేళ...కార్పొరేట్ల కొమ్ము కాసి... పేటెంట్‌ ద్వారా కాసులు దండుకునేందుకు దారులు వేశాయి ప్రభుత్వాలు.
     మన దేశంలో డ్రగ్స్‌ సేవిస్తున్న వారిలో 80 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. వారిలో కూడ ధనిక వర్గాల వారు హెరాయిన్‌, కొకైన్‌, ఒపియాడ్స్‌, ఇంజెక్షన్ల వంటి వాటి ద్వారా సేవిస్తే...పేద, మధ్యతరగతి యువకులు గంజాయి వంటివి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే...ఇప్పుడు ఆ తరగతి యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది. విలాసాలకు అలవాటున పడిన చదువుకున్న యువకుల ద్వారా... మధ్యతరగతికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. ''నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌'' పథకం ద్వారా 272 జిల్లాల్లో 13,000 మంది వాలంటీర్లను పెట్టి డ్రగ్స్‌ను అరికట్టాలని వేసిన ప్రణాళికపై చర్చించకుండా...కేంద్ర హోం మంత్రి అన్ని రాష్ట్రాల హోం మంత్రులను పిలిచి వామపక్ష తీవ్రవాదంపై చర్చించి వదిలేశారు. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. దీని వలన 2017-18 మధ్యలో 2,300 మంది మృతి చెందారు. ఉత్సాహం ఉరకలు వేసే యువతతో పటిష్టమైన దేశాన్ని నిర్మిస్తామంటూనే ... వారిని నిర్వీర్యం చేసే మాదకద్రవ్య వ్యాపారాన్ని కట్టడి చేసే చర్యలకు అణుమాత్రం కదలడం లేదు బిజెపి ప్రభుత్వం. మత్తుకు బానిసలైన యువత...పేదరికం, నిరుద్యోగం, పెరిగిన ధరలు...వేటినీ పట్టించుకోలేని విధంగా తయారౌతుంది. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లోనూ వ్యాపారులకు లాభాలు వచ్చిపడుతుంటాయి. పాలకులను ప్రశ్నించే వారూ తగ్గిపోతారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందంగా లేదూ!
 

/ వ్యాసకర్త - డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి /
ఎం. సూర్యారావు