
ప్రజాశక్తి - బాపట్ల
మాదిగల విశ్వరూప మహాపాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని మాదిగపల్లెలు కదలి రావాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ముమ్మిడి చిన్న సుబ్బారావు కోరారు.కలెక్టరేట్ మార్గంలో కాసా భవన సముదాయంలో గురువారం జరిగిన ఎంఆర్‌పిఎస్, మహాజన సోషల్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర సంఘీభావ సదస్సులో చిన్న సుబ్బారావు మాట్లాడారు. మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణకు రానున్న శీతాకాల సమావేశాల్లో చట్టబద్ధత కల్పించా లని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఇతర అనుబంధ సంఘాలు ప్రతి గ్రామంలో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని అన్నారు. మహాజన సోషల్ పార్టీ జిల్లా కన్వీనర్ బుడంగుంట్ల లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి మహా పాదయాత్ర లక్ష్యాలను తెలిపే విధంగా గడప గడపకు కరపత్రాల పంపిణీ చేయాలని అన్నారు. మహాపాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు. సదస్సులో పట్టణ కన్వీనర్ తాళ్ళూరి రాజేష్, జిల్లా కోకన్వీనర్ దుడ్డు వందనం, వేణు, బుజ్జి, దాసు, సత్యానారాయణ, రమేష్, భాస్కర్, కిషోర్, ఆంటోనీ, తేళ్ల శ్రీనివాసరావు, రాకేష్, మున్నా, అభిరామ్, యేసు బాబు, యేసుపాదం పాల్గొన్నారు.