మాదిగ పేటపై దాడి అమానుషం
- కెవిపిఎస్, ఎంఆర్‌పిఎస్, మాల మహానాడు
ప్రజాశక్తి - నందవరం
మండలంలోని పొనకలదిన్నే గ్రామంలో గురువారం రాత్రి మాదిగ పేటపై గ్రామంలోని అగ్రకులాలు మూకుమ్మడిగా దాడికి పాల్పడి, విచక్షణ రహితంగా దాడి చేసి మాదిగలను గాయపరచడం అమానుషమని టిడిపి ఎస్‌సి సెల్ తాలుక అధ్యక్షుడు దావీదు, బాలరాజు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆనంద్, చైతన్య మాదిగ, కెవిపియస్ జిల్లా ఉపాధ్యక్షులు కనకవీడు రాజు, మాల మహానాడు (చెన్నయ్య వర్గం) జిల్లా గౌరవ అధ్యక్షులు గుడికల్ రాజోలప్పలు అన్నారు. శుక్రవారం అగ్రకులాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పొనకలదిన్నె గ్రామ మాదిగ బాధితులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పరామర్శించారు. సంఘటనలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నందవరం మండలం తహసిల్దార్ కార్యాల యం ఎదుట ఆందోళన నిందితులను కఠినంగా శిక్షించాలని రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు ఏడాది క్రితమే గ్రామపంచాయతీ తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు కేటాయించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి మాదిగలు పునాది తవ్వితే సహించని గ్రామ పెత్తందారులు రోడ్డు నిర్మాణం పేరుతో తవ్విన గుంతను పూడ్చడమే కాకుండా గ్రామంలో విగ్రహం పెడతారా! మీరు దళితవాడలకే పరిమితం కావాలి అంటూ భయానకం వాతావరణం సృష్టించి, కులం పేరుతో దూషిస్తూ అధికార పార్టీకి చెందిన అగ్రకుల దురహంకారులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దీనిని ప్రజాస్వామిక వాదులుతీవ్రంగా ఖండించాలన్నారు. ఆదోని డివిజన్‌లో దళితులపై దాడులు అధికమైనప్పటికీ నిలువరించడంలో పోలీస్ అధికారులు ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. దళితులపై జరిగిన సంఘటనను చూస్తుంటే కారంచేడు, చుండూరు, లక్ష్మీంపేట సంఘటనలను తలపిస్తుందని ఆవేదన చెందారు. దాడులకు గురైన గ్రామాలను అట్రాసిటీ గ్రామాలుగా గుర్తించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సందర్శించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. గ్రామాలలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేసి దళితులకు భద్రత కల్పించి, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. మాదిగలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు హాలహర్వి గంధాలం ప్రభాకర్ మాదిగ, శావల చిన్న రంగన్న మాదిగ, కెవిపిఎస్ ఎమ్మిగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సుమాల అంతోని, వెంకటాపురం గుంటేప్ప, మాల మహానాడు నాయకులు గుడికల్ లక్ష్మన్న , ఎమ్మార్పీఎస్ నాయకులు సలింద్ర మాదిగ, గంజహళ్లి బాబు మాదిగ, కంబలదిన్నె ఆరోను మాదిగ, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.










