Aug 06,2023 23:24


ప్రజాశక్తి - వినుకొండ, విజయపురిసౌత్‌ : టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 176వ రోజైన ఆదివారం బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం నుండి కొనసాగిన యాత్ర వినుకొండ నియోజకవర్గంలో ముగించుకొని మాచర్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కారంపూడి శ్రీచక్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద టిడిపి మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో లోకేష్‌ను సత్కరించారు. అనంతరం లోకేష్‌వెంట నడుచుకుంటూ కారంపూడి తండా వద్ద ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవి ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, చిరుమామిళ్ల మధుబాబు ఉన్నారు. స్వాగతం పలికేందుకు టిడిపి శ్రేణులు భారీఎత్తున తరలివచ్చారు.
ఇదిలా ఉండగా వినుకొండ నియోజకవర్గం పాదయాత్రలో రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌, మిర్చి, ఇతర కూరగాయలతో చేసిన గజమాలను రైతులు లోకేష్‌కు వేసి సత్కరించారు. పంటకు మద్దతు ధర లేక ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. లోకేష్‌ మాట్లాడుతూ పంట నష్టపోయి అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని సీఎం కారణంగా రాష్ట్ర రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే నాగార్జున సాగర్‌ కాల్వలను ఆధునీకరణ చేపట్టి చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామన్నారు. వరికపూడిశెల నిర్మాణాన్ని చేపట్టి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంటలకు మద్దతు ధరలిస్తామన్నారు. మేళ్ల వాగు గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తండాలకు రవాణా సౌకర్యం లేక చదువుపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లాపల్లికి వెళ్లడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, హాస్టళ్లు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. హాస్టళ్ల ఏర్పాటుకు తగిన స్థలం కూడా అందుబాటులో ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్యార్థులకు చేరువగా పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. పాఠశాలల విలీనం పేరుతో జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 4 లక్షల మంది గ్రామీణ విద్యార్థులకు చదువు దూరమైందని అన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవటం, ఫ్లోరైడ్‌ ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పేద రైతులకు మంజూరు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించి, చుక్కల భూములకు చట్టబద్ధంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. దీర్ఘకాలంగా ఉన్న అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తూ చుక్కల భూముల సమస్యలు కూడా శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇదిలా ఉండగా వికలాంగులూ తరలివచ్చి తమ సమస్యలను లోకేష్‌కు వివరించారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్‌ వినతిపత్రం ఇచ్చారు. వినుకొండ నియోజకవర్గం సరిహద్దు వరకు జీవి ఆంజనేయులు, ఆయన భార్య లీలావతి పాదయాత్రలో పాల్గొన్నారు.