ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల పురపాలక సంఘంలో గురువారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో 17వ వార్డు కౌన్సిలర్ మాచర్ల చిన్న ఏసోబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఇన్‌ఛార్జి చైర్మన్‌గా వ్యవహరించిన వైస్‌చైర్మన్ బోయ రఘురాంరెడ్డి తప పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ఎన్నికల ఒప్పందంలో భాగంగానే తొలి విడతగా బీసీ సామాజిక తరగతికి చెందిన తురక కిషోర్ మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర తర్వాత ఆయన సెలవు పెట్టడంతో వైస్ చైర్మన్‌గా ఉన్న రఘురామిరెడ్డి ఇన్‌ఛార్జి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏడు నెలల అనంతరం రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఎన్నికైన ఏసోబు ఏడాది పాటు వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. తురక కిషోర్ ప్రస్తుతం తిరిగి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అధికారిగా గురజాల ఆర్డీవో అద్దెయ్య వ్యవహరించారు. కౌన్సిల్ హాల్‌లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఆర్డీవో అద్దెయకు మాచర్ల చిన్న ఏసోబును తమ పార్టీ తరఫున వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బి ఫారంను వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అందజేశారు. ఏసోబు అభ్యర్థిత్వాన్ని 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ ప్రతిపాదించగా రెండవ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు బలపరిచారు. మరొకరు పోటీలో లేకపోవడంతో ఏసోబు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసోబుకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, తురక కిషోర్, కమిషనర్ రమణబాబు, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు.










