Aug 12,2023 00:14

మంత్రి, ఎమ్మెల్యే మధ్యలో నూతన చైర్మన్‌ చిన్న ఏసోబు

ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌గా మాచర్ల చిన్న ఏసోబు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న టి.కిషోర్‌ దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో వైస్‌ చైర్మన్‌గా ఉన్న 18వ వార్డు కౌన్సిలర్‌ మాచర్ల ఏసోబును నూతన చైర్మన్‌గా ఎన్నికున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణస్వీకారానికి మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్మన్‌గా తొలిసారి ఎస్సీ సామాజిక తరగతికి చెందిన వ్యక్తి ఎన్నికవడంతో ఆ సామాజిక తరగతి నుండి శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని సామాజిక తరగతులకు న్యాయం జరుగుతోందన్నారు. అయితే ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. మాచర్ల చరిత్రలో తొలిసారిగా ఎస్సీలు చైర్మన్‌ కావడంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషి ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందానికి చంద్రబాబు ఆయన అనుచరులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని, అందరం జాగ్రత్తగా ఉండి సిఎం స్థానంలో మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని కూర్చోబెట్టాలని అన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న స్థానిక నాయకులకు ఎన్నికల అనంతరం వారికి చెప్పాల్సిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు టి.కిషోర్‌, బి.రఘురామిరెడ్డి, కమిషనర్‌ రమణబాబు, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సాయి మార్కొండ రెడ్డి, నాయకులు కె.కోటయ్య పాల్గొన్నారు.