Dec 22,2022 00:03

ఎస్‌పికి వినతిపత్రం ఇస్తున్న టిడిపి నేతలు నాగజగదీష్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి : మాచర్ల చోటుచేసుకున్న సంఘటనలో దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఎస్పీ గౌతమి శాలికి టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు. జరుగుతున్న పరిణామాలపై టిడిపి శ్రేణులు డిజిపి, ఎస్పీలకు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈనెల 16న ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేత బ్రహ్మానంద రెడ్డిపైనా, పార్టీ నాయకులపైనా వైసిపి గుండాలు దాడులు చేశారని, బ్రహ్మానంద రెడ్డి ఇంటిని దగ్ధం చేశారని తెలిపారు. ఇంత మారణకాండ జరిగినా పోలీసులు కనీసం వారిపై కేసులు పెట్టకుండా బాధితులపైనే కేసులు పెట్టి గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుప్పిలి జగన్మోహన్‌, మల్ల గణేష్‌, దొడ్డి జగదీష్‌, గుర్రాల వాసు, వానపల్లి కోటేశ్వరరావు, బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అండిబోయిన శేషు తదితరులు పాల్గొన్నారు.