ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:ఆంధ్ర, ఒడిశా సంయుక్త రాష్ట్రాలు నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీ జెన్కో డైరెక్టర్ ఎంవివి సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇటీవల మరమ్మతుకు గురైన టిపి డ్యామ్ ట్రాస్ రాక్ లైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ జెన్కో డైరెక్టర్ మాట్లాడుతూ, 6వ నెంబర్ జనరేటర్ గత ఆరు నెలలుగా మరమ్మత్తుకు గురైనా ఇంతవరకు వినియోగం లోకి తీసుకొని రాకపోవడంపై ప్రాజెక్టు ఉద్యోగులు, కార్మికులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరమత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ ఉద్యోగులకు సూచించారు. గత ఆరు నెలలుగా నిలిచిన ఆరవ నెంబర్ జనరేటర్ మరమ్మతులు చేయడానికి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ఆయన ప్రశ్నించారు.
నిలిచిన ఆరో నెంబర్ జనరేటర్‌ను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు పనులు పూర్తి చేయాలని ఆయన ప్రాజెక్ట్ ఉద్యోగులకు సూచించారు. విద్యుత్ కేంద్రంలో వివిధ విషయాలపై ఉద్యోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రాజెక్ట్‌లో ఉద్యోగులు, కార్మికుల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం విద్యుత్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ బి.శ్రీధర్, ఎస్‌ఈ కె.వి నాగేశ్వరరావు, ఈఈ టెక్నికల్ మోతుగూడెం, బాలకృష్ణ పాల్గొన్నారు.










