May 11,2023 19:54

వైసిపి సీనియర్‌ నాయకులు జగన్మోహన్‌ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో ఉన్న మాచాని సోమప్ప ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అజిత్‌, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. గురువారం వైసిపి నాయకులు జగన్మోహన్‌ రెడ్డికి, ఎంఇఒ ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అజిత్‌ మాట్లాడారు. మాచాని సోమప్ప ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో గత కొన్నేళ్లుగా అడ్మిషన్లను ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని తెలిపారు. ఫీజుల పేరుతో పేద విద్యార్థుల దగ్గర రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూల్‌లో చేర్పించడానికి వెళితే 'మా దగ్గర సీట్లు లేవు. మేము ఇవ్వం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి' అని స్కూలు యాజమాన్యం, హెచ్‌ఎం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు ఆదర్శనీయుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప పేరును స్కూల్‌కు పెట్టుకుని పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా హెచ్‌ఎం, యాజమాన్యం నిరాకరిస్తున్నారని చెప్పారు. ఎంఇఒ ఆంజనేయులుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. స్కూల్‌లో జరుగుతున్న అడ్మిషన్ల గోల్‌మాల్‌ గురించి వైసిపి సీనియర్‌ నాయకులు జగన్మోహన్‌ రెడ్డికి వివరించారు. ఆయన స్పందిస్తూ... స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడి పేద విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.