ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం అనుపాలెం వద్ద నారా లోకేష్ క్యాంప్ సైట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక కాసు మహేష్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని, మహేష్ రెడ్డి అక్రమార్జనపై లోకేష్ చేసిన ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి గురజాల, మాచర్ల పక్కనే ఉన్నాయని రోజు ఒక లారీ మద్యాన్ని ఆంధ్రలోకి తెచ్చి అక్రమంగా అమ్మకాలు జరిపి రోజుకు రూ.కోటి సంపాదిస్తున్నారని విమమర్శించారు. సారా డబ్బుతో ఇల్లు కట్టారంటూ చంద్రబాబపై మహేష్‌రెడ్డి ఆరోపణలు చేశారని, అయితే టిడిపి, కాంగ్రెస్ అధికారంలో ఉండగా బ్రాండెడ్ మధ్యమే అమ్మారు గాని ఐదు రూపాయల విషపు నీరు అమ్మలేదని దుయ్యబట్టారు. సిఎం జగన్ అవినీతి సొమ్ముతో తాడేపల్లిలో ఇల్లు కట్టారని ఎద్దేవా చేశారు. వైసిపి కార్యకర్తలు చనిపోతే కనీసం పట్టించుకోరని అదే టిడిపిలో కార్యకర్తలు చనిపోతే ట్రస్టు ద్వారా వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందజేస్తున్నామని చెప్పారు. గురజాల నియోజకవర్గంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మరుగుదొడ్ల సొమ్ముతో రూ.50 కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కట్టినట్లు తనపై మహేష్‌రెడ్డి ఆరోపణలు చేశారని, తాను 2014 వరకు అద్దె ఇంట్లో ఉన్నానని అన్నారు. తన వద్ద కాసులు లేవని పదేపదే చెప్పే మహేష్‌రెడ్డికి నరసరావుపేటలో కాంప్లెక్స్ ఎలా కడుతున్నారని, హైదరాబాద్ గచ్చిబౌలిలో కోట్ల విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.
20 శాతం పనులనూ పూర్తి చేయలేదు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : నారా లోకేష్‌ను, గురజాల నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన యరపతినేని శ్రీనివాసరావును విమర్శించే స్థాయి వైసిపికి లేదని టిడిపి పట్టణ అధ్యక్షులు గోంట్ల శ్రీనివాసరావు అన్నారు బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపి గ్రామాలను రూ.కోట్లతో యరపతినేని శ్రీనివాసరావు అభివృద్ధి చేశారని అన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అమీర్ అలీ మాట్లాడుతూ వైసిపిలో మైనార్టీలకు సరైన స్థానం లేదని మొక్కుబడిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చి మైనార్టీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు టిడిపి ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గంలో యరపతినేని శ్రీనివాసరావు మైనార్టీల కోసం మదర్సాలు నిర్మించాలని 47 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సహాయం అందించాలని, షాదీఖానాలు నిర్మించారని అన్నారు. కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మైనార్టీల కోసం ఏమీ చేయలేదన్నారు. కనీసం యరపతినేని శ్రీనివాసరావు 80 శాతం పూర్తిచేసిన షాదీఖానాలు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవ చేశారు.










