ప్రజాశక్తి - వినుకొండ: పట్టణ ప్రజల కోసమని అడిగితే తమ ఊరి చెరువు నుండి నీరిచ్చామని, తీరా ఆ పేరుతో చేపల వ్యాపారులతో కుమ్మక్కై మా గ్రామానికే నీరు లేకుండా తరలించుకుపోయారని దొండపాడు గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలోని చెరువు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. దొండపాడులోని 1400 ఎకరాల్లోని చెరువు చేపల చెరువు కావడంతోపాటు ఆ చెరువు నుండే స్థానికులు ఇంటి అవసరాల కోసం నీటిని వాడుకుంటూ ఉంటారు. ఈ చెరువు సుమారు ఏడు అడుగులు ఉండడంతో ఈ చెరువులో నీటినే గేదెల కోసం, ఇళ్లల్లో ఇతర అవసరాలకు వాడుకోవడానికి గ్రామస్తులు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా ఈ చెరువు కింద 7 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు వల్లే ఇక్కడ భూగర్భ జలాలు వృద్ధి చెందుతూ గ్రామంలో తాగు, సాగు అవసరాలకూ ఉపయోగపడుతున్నాయి.
ఈ క్రమంలో వినుకొండ పట్టణ ప్రజల కోసమని ఈ చెరువు నుండి నీటిని తరలించడానికి మున్సిపల్ అధికారులు సంప్రదించగా ఒక్క అడుగు నీటిని తీసుకోవడానికి గ్రామం అంగీకరించింది. అయితే ప్రజాప్రతినిధులు, మున్సిపల్, అధికారులు కలిసి చేపల వ్యాపారులతో కుమ్మయ్యారని, చెరువులో మూడు అడుగుల వరకూ నీటిని తరలించుకుపోయారని స్థానికులు బత్తుల గోవిందు, గుంట గోవిందరాజులు, నాగేశ్వరరావు, ఇతర మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. ఈ చర్యల వల్ల తమ గ్రామ అవసరాలు తీరకపోవడతోపాటు వ్యవసాయ అవసరాలకూ నీరు లేదని మండిపడ్డారు. ఇది తమకు తీరని అన్యాయమన్నారు. ఇప్పుడున్న నీటినైనా తాము కాపాడుకోకుంటే గొడ్డు.. గోదా.. పిల్లా.. పాప.. అంతా అవస్థ పడాల్సి వస్తుందని అన్నారు. చేపల చెరువు సొసైటీ వదులుకునేందుకైనా సిద్ధమని, తమకు నీటిని మాత్రం దూరం చేయొద్దని కోరారు. ఇకమీదట అనధికారికంగా తరలిస్తే అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఈ చెరువులో రూ.10 కోట్ల చేప పిల్లలు వేసి రూ.25 కోట్ల వ్యాపారం చేశారని, సొసైటీ సభ్యులకు రూ.రెండు మూడు వేలిచ్చి సరిపెట్టిన వ్యాపారులు మిగతా ఆదాయాన్ని మొత్తం దోచుకుంటున్నారని, ఈ చేపల చెరువు ద్వారా వ్యాపారం చేసిన వ్యక్తి ఈ ప్రాంతంలోనే 3 వేల ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. తామంతా వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నామని, ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీలో ఉండటం వలన నీరు వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇప్పుడు తాము వ్యవసాయం చేయాలంటే చెరువు నీరు ఆధారమన్నారు.










