Jul 31,2023 22:58

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కష్ణా), విజయవాడ
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు మచిలీపట్నం కలెక్టరేట్‌ వద్ద గల ధర్నా చౌక్‌, విజయవాడ ధర్నాచౌక్‌ల్లో సోమవారం ధర్నాలు నిర్వహించారు. పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీ రూ.20 ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు, స్వచ్చంద సంస్థలకు అప్పగించొద్దని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కార్మికులు నినదించారు. మచిలీపట్నంలో జరిగిన ధర్నానుద్దేశించి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎం.మురళీ, సిఐటియు కృష్ణాజిల్లా అధ్యక్షులు చౌటుపల్లి రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి రమాదేవి, ఉపాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, ఝాన్సీ, లలిత, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ దేవేంద్ర, ఎలక్ట్రి సిటీ కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ నాయకులు మణిపాల్‌, ఎల్‌ఐసి నాయకులు చంద్రపాల్‌, సిఐటియు జిల్లా కోశాధికారి బి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఎం.పోలినాయుడు, మచిలీపట్నం కార్యదర్శి సిహెచ్‌.జైరావు పాల్గొన్నారు.
విజయవాడ అలంకార్‌ సెంటర్లోని ధర్నాచౌక్‌లో జరిగిన ధర్నాలో యూనియన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌.సుప్రజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు యం.వి.సుధాకర్‌, కె.గోపాల్‌, శ్రామిక జిల్లా కన్వీనర్‌ ఎ.కమల తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా నాయకులు ఎ. సుశీల, ఎ. రాజేశ్వరి, దుర్గాభవానీ, కనకదుర్గ, ఈశ్వరమ్మ, పద్మ వి.యేసోబు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం యూనియన్‌ నాయకులు నగరంలోని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు వినతిపత్రాన్ని అందచేశారు. సమస్యలను పరిష్కారానికి కషి చేస్తానని కలెక్టర్‌ తెలిపారు.