Nov 09,2023 21:57

కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

సాలూరు: మా పొలంలో మట్టి పెరుగుకోడానికీ మేం పన్ను కట్టాలా? మేం ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తీయడం లేదు, ఒక పొలంలో మట్టిని మరో పల్లపు ప్రాంతంలోకి రవాణా చేసుకుంటున్నాం అని రైతులు, ట్రాక్టర్‌ యజమానులు ఫిర్యాదు చేశారు. గురువారం డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిసి రాఘవేంద్ర కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ సిబ్బంది దందాపై వారు మొరపెట్టుకున్నారు. గత కొద్ది నెలలుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాఘవేంద్ర కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి పిక్కరాయి, మట్టి, కంకర రవాణాపై గుత్తాధిపత్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఎక్కడికక్కడ ప్రయివేటు సైన్యాన్ని నియమించుకుని వారితో వసూళ్లు చేపడుతోంది. ట్రాక్టర్‌ పిక్కరాయి లోడుపై అదనంగా రూ.1200 వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ భారం పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఈ ఆంక్షలు విధించడంపై సామాన్య ప్రజలు గుర్రుగా ఉన్నారు. సొంత పొలంలో, స్థలాల్లో నుంచి మట్టిని, కంకరను మరోచోట ఉన్న సొంత లోతట్టు భూమి లోకి మట్టి తరలిస్తే ప్రభుత్వానికి ఎందుకు పన్ను కట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఈ ప్రాంత రైతులు, ట్రాక్టర్‌, జెసిబి యజమానులు జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ హామీ ఇచ్చారు. గురువారం వారు డిప్యూటీ సిఎం రాజన్నదొరను కలిసి ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. దీనిపై ఆయన సంబంధించిన కంపెనీ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. సొంత స్థలాల్లో నుంచి మట్టి, కంకరను మరోచోటకు రవాణా చేసుకుంటే మీకెందుకు పన్ను కట్టాలని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము మట్టి, కంకర రవాణాపై ఆంక్షలు విధిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విధానం మార్చాలని రైతులు, ట్రాక్టర్‌ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తున్న వారిపై ఆంక్షలు లేకుండా సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.