Aug 09,2023 19:42

బాధితులకు సర్ది చెబుతున్న ఎఎస్‌ఐ తిమ్మారెడ్డి

ప్రజాశక్తి - గోనెగండ్ల
తమ పొలాన్ని రెడ్‌ మార్క్‌ హోల్డ్‌లో నుంచి తొలగించి తమ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పెద్దనేలటూరు మాజీ సర్పంచి చాకలి వీరన్న, ఆయన భార్య చాకలి శివలక్ష్మి కోరారు. బుధవారం గోనెగండ్ల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పురుగు మందు డబ్బాతో బైఠాయించి నిరసన చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుల వివరాల మేరకు... గ్రామంలో చాకలి వీరన్న తండ్రి చాకలి ఉళ్లక్కి పేరుతో 430 సర్వే నెంబర్‌లో రెండెకరాలు, చాకలి వీరన్న పేరుతో మూడెకరాలు, ఆయన భార్య చాకలి శివపార్వతి పేరుతో నాలుగెకరాలు మొత్తం తొమ్మిది ఎకరాలు ఉంది. వాటికి ఖాతా నెంబర్లతో సహా పాస్‌ బుక్‌లు కూడా ఉన్నాయి. పొలం మొత్తం నేటి వరకు వీరి అనుభవంలోనే ఉంది. 2015లో వీరన్న తండ్రి పేరుతో ఉన్న రెండెకరాల భూమిని గ్రామానికి చెందిన వేరే వ్యక్తి తన పేరుపై ఆన్‌లైన్‌ మార్చుకొని తన భూమిని వేరే వాళ్లు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని కోర్టుకెళ్లారు. అప్పటి నుంచి రెండెకరాల పొలం వివాదంలో ఉంది. రెవెన్యూ అధికారులు 430 సర్వే నెంబర్‌లోని మొత్తం పొలాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగించి హోల్డ్‌లో ఉంచడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేక ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు తెలిపారు. వివాదంలో ఉన్న రెండెకరాలను మినహాయించి మిగతా ఏడెకరాలను హోల్డ్‌లో నుంచి తొలగించి తిరిగి యథావిధిగా తమ పేరుపై ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరన్న, ఆయన భార్య శివ పార్వతి, కుమారులు పురుగు మందు డబ్బాతో తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని బైఠాయించారు. అధికారులు, సిబ్బంది ఎలాంటి సమాధానమూ ఇవ్వకుండా ఒక్కొక్కరుగా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసి ఎఎస్‌ఐ తిమ్మారెడ్డి, పోలీసులు తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని బాధితులకు నచ్చజెప్పి కార్యాలయం నుంచి ఇంటికి పంపారు.