ఇ-క్రాప్ నమోదుపై కౌలురైతుల ఆవేదన
వాస్తవ సాగుదారులు 90 శాతం నమోదుకు దూరం
ఖరీఫ్ ధాన్యం అమ్మకానికి కౌలురైతుల నానావస్థలు
రబీలోనైనా కౌలురైతుల పేర్లు నమోదుకు డిమాండ్
కొల్లేరును ఆనుకుని అనసరి భూముల ఇ-క్రాప్‌పై అధికారుల మౌనం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కష్టపడి సాగు చేస్తున్న కౌలురైతుల పేర్లు ఇ-క్రాప్‌లో నమోదు కావు. ప్రభుత్వం అందించే ఏఒక్క సాయమూ వారికి అందదు. చివరికి తాము పండించిన ధాన్యం సైతం తమ పేరు మీద అమ్ముకోవడానికి లేకుండాపోయింది. ధాన్యం తరలింపునకు అయ్యే రవాణా, జట్టు ఖర్చులు సైతం వారికి అందని దుస్థితి నెలకొంది. ఇ-క్రాప్‌లో కౌలురైతుల పేర్లు నమోదు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. రబీకి సంబంధించి ఇ-క్రాప్ నమోదు జరుగుతుండటంతో ఈసారైనా తమ పేర్లు నమోదు చేయండయ్యా అంటూ కౌలురైతులు మొత్తుకుంటున్న పరిస్థితి రెండు జిల్లాల్లోనూ నెలకొంది.
రెండు జిల్లాల్లోనూ రబీకి సంబంధించి ఇ-క్రాప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీ నుంచి సాగుతోంది. ఇ-క్రాప్ నమోదులో కౌలురైతుల పేర్లు ఈసారీ నమోదు చేయకపోవడంపై సాగుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాగు చేస్తున్న కౌలురైతుల పేర్లు కాకుండా భూయజమానుల పేర్లు నమోదు చేయడం ద్వారా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కౌలురైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల వరకూ వరి సాగవుతోంది. రెండు జిల్లాల్లోనూ 75 శాతం వరిసాగు కౌలురైతులే చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇ-క్రాప్‌లో సాగు చేస్తున్న రైతుల పేర్లు నమోదు చేయాలి. అయితే ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. సిసిఆర్‌సి ఉంటే కౌలురైతుల పేర్లు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. రెండు జిల్లాల్లోనూ దాదాపు మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు ఉండగా సిసిఆర్‌సి కార్డులు అందుకున్న కౌలురైతులు సగం కూడా లేరు. అదీ పదెకరాలు సాగు చేస్తున్న కౌలురైతుకు రెండెకరాలకు మాత్రమే సిసిఆర్‌సి కార్డు ఇచ్చిన పరిస్థితి ఉంది. సాగు చేయని భూయజమానుల పేర్లు ఇ-క్రాప్‌లో నమోదవుతున్నాయి. దీంతో ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బతిన్న పరిహారం సైతం భూయజమానికి వెళ్లిపోతుంది. బీమా, బ్యాంకులిచ్చే పంట రుణం సహా అన్ని భూయజమాని జేబుల్లోకి చేరుతున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో కౌలురైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవ సాగుదారులైన కౌలురైతులకు అన్యాయం చేస్తూ భూయజమానులకు కొమ్ముకాస్తున్న పరిస్థితి ఉంది.
పండించిన ధాన్యం సైతం అమ్ముకోలేని దుస్థితి
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం సైతం కౌలురైతులు తమ పేరు మీద అమ్ముకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు అంతా ఇ-క్రాప్ ఆధారంగానే ప్రభుత్వం సాగిస్తోంది. ఇ-క్రాప్‌లో భూయజమానుల పేర్లు నమోదవ్వడంతో పండిన పంటసైతం వారి పేరు మీదే అమ్మాల్సి వస్తోంది. దీంతో ధాన్యం సొమ్ము భూయజమాని ఖాతాల్లోనే జమవుతోంది. గతంలో కౌలురైతులు పంట విక్రయించి కౌలు సొమ్ము భూయజమానికి ఇచ్చేవారు. దిగుబడి తక్కువగా వస్తే ఎంతోకొంత తగ్గించి భూయజమానికి ఇచ్చి బతిమలాడుకునేవారు. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది. భూయజమాని ఖాతాలో సొమ్ము జమ కావడంతో పంట పండినా.. పండకపోయినా పూర్తి కౌలుసొమ్ము తీసుకుని మిగిలిన సొమ్ము కౌలురైతులకు ఇస్తున్నారు. ధాన్యం సొమ్ము జమయ్యే వరకూ పెట్టిన పెట్టుబడికి సైతం వడ్డీ కడుతున్నారు. గడిచిన ఖరీఫ్‌లో ప్రభుత్వం నూతన ధాన్యం కొనుగోలు విధానం తెచ్చింది. దీంతో జట్టు, రవాణా ఛార్జీలు వంటివి సైతం రైతులు పెట్టుకుని ధాన్యం తరలించిన పరిస్థితి నెలకొంది. జట్టు, రవాణా ఛార్జీలు సైతం భూయజమాని ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఈ సొమ్ము నిబంధనల ప్రకారం కౌలురైతులకు ఇవ్వాల్సి ఉన్న భూయజమానులు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే పొలం కౌలుకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో కౌలురైతుల పరిస్థితి అత్యంతదారుణంగా తయారైంది. ఇ-క్రాప్ నమోదులో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారం కారణంగానే కౌలురైతులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనసరి భూములను ఇ-క్రాప్ చేయరూ..!
ఇ-క్రాప్ నమోదైతేనే ఆ భూమికి సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొల్లేరును ఆనుకుని పట్టాల్లేని అనసరి భూములు ఏలూరు, పశ్చిమగోదారి జిల్లాల్లో వేలాది ఎకరాలు ఉన్నాయి. నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఆకివీడు వంటి మండలాల్లో ఉన్న అనసరి భూముల్లో పెద్దఎత్తున రబీసాగు సాగుతోంది. ఈ భూములకు సంబంధించి ఇ-క్రాప్ నమోదుపై ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వకుండా మౌనం వహిస్తున్నారు. దీంతో దిగువస్థాయి అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొల్లేరును ఆనుకుని ఉన్న అనసరి భూముల ఇ-క్రాప్‌పై వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే రబీ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి రానుందని ఆందోళన చెందుతున్నారు.










