Sep 29,2023 22:15

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

'మా నమ్మకం నువ్వే జగన్‌' విజయవంతం చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్ర వైసిపి ఆదేశాల మేరకు 'మా నమ్మకం నువ్వే జగన్‌' కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 'ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి' అనే నినాదంతో ప్రజలందరితో మమేకం కావాలని సూచించారు. అక్టోబర్‌ 9వ తేదీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 11వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందచేసిన సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డుల ఆవిష్కరణలు, మన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సచివాలయం పరిధిలో పార్టీ మండల అధ్యక్షుడితోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాలకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. సచివాలయ కన్వీనర్ల నేతృత్వంలో గృహసారథులు ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను 100 శాతం నిర్వహించేలా చూడాలన్నారు. ప్రతి క్లష్టర్‌ పరిధిలో రోజుకు 10 నుంచి 15 గృహాలను సందర్శించే విధంగా చూడాలని తెలిపారు. ప్రచారానికి అవసరమైన సామాగ్రిని అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కావాలనే లక్ష్యంతో అందరం సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సూచించారు.