
రక్షించాలని ఎస్‌పికి వృద్ధ దంపతుల ఫిర్యాదు
ప్రజాశక్తి - భీమవరం రూరల్
తమ పెద్ద కుమారుడు కానిస్టేబుల్ మధుతో తమకు ప్రాణహాని ఉందని రిటైర్డ్ ఎఎస్‌ఐ పోడూరి కొండలరావు, భాగ్యలక్ష్మి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎఎస్‌ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యానని, తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని కొండలరావు తెలిపారు. స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ద్రోణం రాజు వారి వీధిలో నివాసం ఉంటున్నామన్నారు. తమ పెద్ద కుమారుడు మధు తనకు రూ.కోటి ఆస్తి కావాలని తమను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మధు ఏలూరు జిల్లా దెందులూరులో నివాసం ఉంటున్నాడని, అతను ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన భార్య భాగ్యలక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో మధు వైద్యం చేయిస్తానని, తన ఇంటికి దెందులూరు రావాలని పిలవడంతో వెళ్లామని, అయితే అక్కడ ఆర్‌ఎంపి డాక్టర్‌తో వైద్యం చేయించాడని చెప్పారు. తర్వాత తాము వెళ్లిపోతామని మధును అడగ్గా ఎక్కడికి వెళ్తారని, ఆస్తి అంత తనకు రాయాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చాడని, తాము ఒప్పుకోకపోవడంతో ఇంట్లో బంధించి తనను, తన భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టాడని, తాము స్థానికుల సాయంతో భీమవరం చేరుకుని భీమవరంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నామని తెలిపారు. మధు కొట్టిన దెబ్బలకే తన భార్య చేయి విరిగిపోయిందన్నారు. మోకాలు, భుజాలపై కొట్టడంతో నేను నడవలేకపోతున్నానని చెప్పారు. తమ కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశామని, ఎస్‌పి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కి పంపించారని తెలిపారు. ఇక్కడ జీరో ఎఫైర్ నమోదు చేస్తామని, దెందులూరులో కేసు నమోదవుతుందని ఇక్కడ పోలీసులు చెప్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని పోలీసులు ఆసుపత్రికి పంపించారన్నారు. తనకున్న ఆస్తి తన ముగ్గురు కుమారులకు సమానంగానే తను ఇవ్వాలనుకుంటున్నానని, కాని తమ పెద్ద కుమారుడు ఎక్కువ ఆస్తి కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు.