వైసిపి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
నేడు జిల్లాలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి శ్రీకారం
అడ్డుకునే ఆలోచనలో టిడిపి, జనసేన
ప్రజాశక్తి - భీమవరం
కుటుంబ భారాన్ని, బాధ్యతలను మోస్తున్న నాన్నో.. అమ్మో.. అన్నో.. భర్తో.. లేక అక్కో మా గృహాలకు సారథులవుతారేగాని వేరే ఇంటికి చెందినవారు ఎలా సారథులవుతారని ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహాంతో ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న విపక్షాలు వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి జిల్లాలో వైసిపి 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జిల్లావ్యాప్తంగా 14 రోజులపాటు 4,16,914 కుటుంబాలను వైసిపి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గృహాలకు వచ్చేవారిని అడ్డుకునేందుకు టిడిపి, జనసేన సమాయత్తమవుతున్నాయి.
ప్రభుత్వం మరో కొత్త ప్రచార కార్యక్రమానికి తెరలేపింది. ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ పార్టీ 'మా నమ్మకం నువ్వే జగన్' పేరిట స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా జిల్లాలో ఈ నెల ఏడో తేదీ నుంచి 20వ తేదీ వరకూ 'జగనన్నే మన భవిష్యత్తు' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. జిల్లాలో భీమవరం, నరసాపురం డివిజన్లతోపాటు జిల్లాలో నూతనంగా కలిసిన గణపవరం మండలంతో కలుపుకుని 20 మండలాలున్నాయి. వాటి పరిధిలో 383 గ్రామ సచివాలయాల పరిధిలో 9,400 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 18.45 లక్షల జనాభా, సుమారు 4.70 లక్షల కుటుంబాలున్నాయి. సచివాలయానికి ముగ్గురు వైసిపి కన్వీనర్లు చొప్పున 1,152 మందితోపాటు ప్రతి 50 ఇళ్లకూ ఇద్దరు చొప్పున సుమారు వేలాది మంది గృహసారథులను వైసిపి నియమించింది. వాలంటీర్లతోపాటు ఇటీవల వైసిపి నియమించిన గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు భాగస్వాములు కానున్నారు. దీంట్లో భాగంగా సచివాలయాలవారీగా జిల్లావ్యాప్తంగా సారధులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో గురువారం సమావేశాలు నిర్వహించారు. సమర్థవంతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎల్‌ఎలు, మంత్రులు దిశానిర్దేశం చేశారు. 14 రోజులపాటు జరిగే కార్యక్రమంలో ప్రతి ఇంటిని, కుటుంబాన్నీ సందర్శించనున్నారు. ఏడాదిలో ఎన్నికలున్నందున ప్రచార జోరు పెంచే వ్యూహాంతో వైసిపి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే వాలంటీర్లు మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. దీనికితోడు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ తరుణంలో ప్రతి ఇంటికీ వెళ్లి స్టిక్కర్లు వేయడం సాధ్యమా అనే అనుమానంతో ఉన్నారు. అధికారులు మాత్రం తప్పనిసరిగా స్టిక్కర్లు వేయాలని, పథకాలు వర్తిస్తున్నప్పుడు కాదనకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అయితే ఇది ఎంతవరకూ ఆచరణ సాధ్యమో అర్థం కావడం లేదని వాలంటీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కింద ఎంఎల్‌ఎలనే నిలదీసిన పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నారు. మాస్థాయిలో ఇంటికెళ్తే ఎదురయ్యే పరిస్థితులను ఎలా అధిగమించగలమని వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ఆందోళన పడుతున్నారు.
ఇంటింటి ప్రచారం ఇలా..
ఇద్దరు గృహసారథులు గ్రామ, వార్డు వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లాలంటూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 'మిమ్మల్ని మీరు వైసిపి ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని సూచించింది'. లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీర్లు ప్రభుత్వ ఆసరా లేఖను అందించాలని ఆదేశించారు. గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగా గత, ప్రస్తుత పాలనను పోల్చే కరపత్రాన్ని చదివి వివరించడంతోపాటు వారికి కరపత్రాన్ని అందించాలని సూచించారు. ప్రజామద్దతు పుస్తకంలోని ప్రశ్నలను చదివి, వారి సమాధానాలను స్లిప్లోటిక్ చేయించమంటున్నారు. ఇంటి వారి పేరు, వారి ఫోన్ నంబరు స్లిప్ మీద రాయమంటున్నారు. ప్రశ్నలకు ఇంటి యజమాని సమాధానం అవును అయితే స్లిప్‌లోని కుడి భాగాన్ని చింపి వారికి ఇవ్వాలని సూచించారు. 82960 82960 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి జగనన్నకు మద్దతు తెలపమని కోరాలని పేర్కొన్నారు. ఇంటివారి అనుమతితో వారి ఫోన్ వెనుక మొబైల్ స్టిక్కర్, తలుపు బయట డోర్ స్టిక్కర్ అంటించాలని ఆదేశించారు. వాటిని ఫొటో తీసి మీ జెసిఎస్ మండల వాట్సాప్ గ్రూపునకు పంపాలని కోరారు. ఇవన్నీ ఎలా అమలు చేయగలమని వాలంటీర్లతోపాటు గృహ సారథులు మదనపడుతున్నారు.
కిట్లు పంపిణీ
మండలాలవారీగా ఇప్పటికే కిట్లను గృహ సారధులకు, వాలంటీర్లకు, సచివాలయ కన్వీనర్లకు అందజేశారు. ఇప్పటికే వీరికి శిక్షణ కూడా అందించారు. ప్రతి కిట్‌లో 200 ఇళ్లకు సరిపడా ప్రచార సామగ్రిని ఉంచారు. గృహ సారథులు ధరించేందుకు ఐదు బ్యాడ్జీలు, స్లిప్‌లు నింపేందుకు ఐదు పెన్నులు, గత, ప్రస్తుత ప్రభుత్వాలను పోల్చే కరపత్రాలు 200, ఫోనుకు అతికించేందుకు 200 మొబైల్ స్టిక్కర్లు, జగనన్న ప్రభుత్వంపై ప్రజామద్దతు సేకరించేందుకు 75 స్లిప్‌లు గల నాలుగు పుస్తకాలు, తలుపులపై అంటించేందుకు డోర్ స్టిక్కర్లు 200, ప్రచార సామగ్రిని పంచేందుకు మూడు అదనపు బ్యాగ్‌లు పంపిణీ చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు
జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగనన్న నినాదంతో వైసిపి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను దూరం పెట్టాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వైసిపి గృహసారథులను, కన్వీనర్లను ఏర్పాటు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు రానున్న నేపథ్యంలో వాలంటీర్లతో గృహసారథులు కన్వీనర్లను ఇప్పటి నుంచి మమేకం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన పార్టీలు ఈ కార్యక్రమం నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా లేకపోతే పథకాలు ఆపివేస్తారనే ప్రచారం జరుగుతోందని, ప్రతి గ్రామంలోని ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విధానాన్ని అడ్డుకుని ఒక వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రసారమాధ్యమంలో టిడిపి విస్తృత ప్రచారం చేసింది. ఈసారి టిడిపి, జనసేన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.










