Oct 02,2023 20:38

జెసిబికి అడ్డంగా చిన్నారితో నిలుచున్న మహిళలు

ప్రజాశక్తి - భోగాపురం :  ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన అధికారులను జమ్మయ్యపేట గ్రామానికి చెందిన విమానాశ్రయ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం అధికారులు ఇండ్లను కూల్చేందుకు జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి జెసిబిలతో వెళ్లారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ మహిళలు ఇంటికి అడ్డంగా నిల్చున్నారు. దీంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ సూర్యకుమారి మహిళలను బయటకు లాగేశారు. అయినప్పటికీ తగినంత పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో నిర్వాసితులను అడ్డుకోలేకపోయారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. మండలంలోని కౌలువాడ పంచాయతీ జమ్మయ్య పేట గ్రామంలో ఆరు గృహాలు విమానాశ్రయం నిర్మాణ పరిధిలోకి వచ్చాయి. ఇందులో ముగ్గురికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదని నిర్వాసితులు అంటున్నారు. దువ్వు పైడమ్మ అనే మహిళకు చెందిన ఇద్దరు కుమారులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి పైడమ్మకు ఇవ్వలేదు. అలాగే బమ్మిడి రామ సూరమ్మ కుమారుడికి ఇచ్చి ఆమెకు ఇవ్వలేదు. దువ్వు కామమ్మకు ఇచ్చి ఆమె కుమారుడు సన్యాసప్పడకి ఇవ్వలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ ఇచ్చే సమయానికి సన్యాసప్పడకి రెండు, మూడు నెలలు వయసు సరిపోక పోవడంతో అప్పట్లో ఇవ్వలేదు. గత కొన్ని నెలల నుంచి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని అధికారులతో పాటు విజయనగరం స్పందనలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇవ్వలేదని వీరు ఆరోపిస్తున్నారు. ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే ఇల్లు కూల్చాలని వీరంతా అడ్డుకుంటున్నారు. ఒక ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చిన అధికారులు మా విషయంలో అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారని వీరంతా ఆరోపిస్తున్నారు.
శివారెడ్డి రాకతో అమటాంలో శాంతించిన రైతులు
ఎ.రావివలస రెవెన్యూ పరిధిలో అమటం వద్ద అదనపు భూమి సేకరణకు ఆర్‌డిఒ సూర్యకళ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి అక్కడికి చేరుకున్నారు. 15 మంది రైతుల నుంచి భూమి సేకరించారు. దీంతో అక్కడ కొంత మంది రైతులు నిరాశ చెందడంతో ఎవరికి ఎంతెంత వచ్చిందో రైతుల ముందే వివరించాలని శివారెడ్డి ఆర్టీవోను కోరారు. దీంతో ఆమె రైతులకు వచ్చిన పరిహారాన్ని వివరించడంతో ఇక్కడ ఎటువంటి వివాదం చోటు చేసుకోలేదు. దీంతో అధికారులు ఆ భూముల్లోని కొబ్బరి, తాటి చెట్లను తొలగించడం ప్రారంభించారు.
విమానాశ్రయ భూముల పరిశీలన
విమానాశ్రయ భూములను విజయనగరం డిఎస్‌పి ఆర్‌. గోవిందరావు సోమవారం పరిశీలించారు. గూడెపు వలస, కంచేరు, దిబ్బలపాలెం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయనతో స్థానిక సిఐ బివి వెంకటేశ్వరరావు ఉన్నారు.