Aug 31,2023 23:10

ఐటిడిఎ పిఒను, ఎంఎల్‌ఎను నిలదీసిన నిర్వాసితులు
ప్రజాశక్తి - జీలుగుమిల్లి

              తమ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని పోలవరం నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించిన ఐటిడిఎ పిఒ సూర్యతేజను, ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజును నిలదీశారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ముంపు గ్రామాలైన టేకూరు, చీడూరు, గాజుల గొంది, కొరుటురు, సిరివాక నిర్వాసిత గ్రామాల్లో ఐటిడిఎ పిఒ, ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వారితో నిర్వాసితులు మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి ఇదే కాలనీల్లో నివాసాలు ఉంటున్నామని, తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో పలు సమస్యలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన భూముల్లో కూడా స్థానిక గిరిజనులు వచ్చి అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ సందర్భంగా ఐటిడిఎ పిఒ మాట్లాడుతు మీకు కేటాయించిన భూముల్లో మీరే సాగులో ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఎల్‌ఎ బాలరాజు మాట్లాడుతూ నిర్వాసితులకు ఎటువంటి సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వాసిత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైసిపికే సాధ్యమైందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి జరిగిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు వసంతరావు, వైస్‌ ఎంపిపి సోమగని శ్రీనివాస్‌, బోదా శ్రీనివాస్‌, నాయకులు ప్రసాద్‌, మాజీ సర్పంచి కోర్స వెంకటేశ్వరరావు, సున్నం సురేష్‌, తహశీల్దార్లు సుందర్‌సింగ్‌, సుమతి, ఎంపిడిఒ కృష్ణప్రసాద్‌, ఎంఇఒ-2 బుచ్చయ్య, కె.రాము, మూలకాల బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.