Oct 16,2023 00:41

బెహరా భాస్కరరావుకు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబీకులు

ప్రజాశక్తి -గోపాలపట్నం : ఎన్‌ఎస్‌టిఎల్‌ నుంచి లక్ష్మీనగర్‌ ఇందిరానగర్‌ మీదుగా గోపాలపట్నం పెట్రోల్‌ బంకు వరకు నిర్మాణం తలపెట్టే బైపాస్‌ రోడ్డు విస్తరణకు సహకరిస్తామని, కానీ తమ గోడును కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతూ జివిఎంసి కో-ఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావుకు బాధిత కుటుంబీకులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. అభివృద్ధికి అడ్డుచెప్పబోమని, దశాబ్దాల నుంచి నివాసముంటున్న తాము ఇప్పుడు ఇళ్లు కోల్పోవడం తీవ్ర నష్టమని, తమకు నష్టపరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించి సహకరించాలని కోరారు. దీనికి బెహరా భాస్కరరావు స్పందిస్తూ అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మనాపల్లి త్రినాధరావు, కడిమి రామకృష్ణ, మార్కండేయ రాజశేఖర్‌, కోనేటి శ్రీను, బండి దుర్గేష్‌ పాల్గొన్నారు.