Aug 27,2023 22:22

వట్లూరు వెమ్‌టెక్నాలజీ బాధిత రైతుల ఆందోళన
జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

'మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి' అంటూ వట్లూరు వెమ్‌టెక్నాలజీ బాధిత రైతులంతా ఏలూరులోని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో 2016లో వెమ్‌టెక్నాలజీ (విమాన విడిభాగాల తయారీ పరిశ్రమ) ఏర్పాటు కోసం వట్లూరులో రైతులు సాగుచేసుకుంటున్న 350 ఎకరాల భూమిని తీసుకుంది. దీంతో వట్లూరు, భోగాపురంతో పాటు చుట్టుపక్కల దాదాపు 300 సన్నా, చిన్నకార రైతులు భూములు కోల్పోయారు. రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇవి చెరువు భూములన్న సాకుతో పరిహారం ఇవ్వకుండా తీరని అన్యాయం చేసింది. అప్పట్లో జిల్లా కలెక్టర్‌ను, ఎంఎల్‌ఎను ఇలా అనేకమందిని కలిసి తమ బాధ వెళ్లబోసుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. భూములు సేకరించి ఏడేళ్లు దాటిపోయింది. ఏ ఒక్క రైతుకూ ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు. సేకరించిన భూముల్లో పరిశ్రమ నిర్మించనూలేదు. పరిశ్రమ నిర్మించకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను వంచించింది. ఇప్పటికైనా తమ భూములు తమకు ఇచ్చేస్తే సాగుచేసుకుంటామంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అనుమతి లేకుండా జాతీయరహదారిపై ఆందోళన చేయకూడదంటూ ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు రైతులను అక్కడనుంచి పంపేశారు. ఈ కార్యక్రమంలో కారంపూడి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కారంపూడి విజరు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, రైతులు పిడిగే జోసఫ్‌, వి.నవీన్‌, మరీదు గంగాధరరావు, మరీదు శ్రీను, పిడిగే రాయప్పతోపాటు దాదాపు వందమంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.