
- 46ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చారు భూములు చూపలేదు
- తహశీల్దారుకు వినతిపత్రం అందజేసిన పేదలు
ప్రజాశక్తి - పంగులూరు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇచ్చుకుంటే భూములు ఇస్తామన్నారు. ప్రభుత్వ మాటలు నమ్మి, ఆపరేషన్ చేయించుకున్నాం. అప్పట్లో పట్టాలు ఇచ్చారు. కాని భూములు ఇప్పటికీ చూపించలేదు. పట్టాలు ఇచ్చి 46ఏళ్లు అవుతుంది. ఇంతవరకు తమ భూములు ఎక్కడున్నాయో తమకు తెలియదని తెలిపారు. కోర్టులు కెళ్ళినా, అధికారులు చుట్టూ తిరిగినా తమ భూములు ఇంతవరకు చూపించలేదు. మీరైనా మా భూములు ఎక్కడున్నాయో చూపించి, మమ్మల్ని ఆదుకోండని మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామానికి చెందిన పేదలు తహశీల్దారు పద్మావతికి గురువారం వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 1976లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి భూములు ఇస్తామని ప్రకటించింది. మండలంలోని తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కలపాడు, జనకవరం, అలవలపాడు, కోరిసపాడు మండలంలోని దైవాలరావూరు, రావినూతల గ్రామాలకు చెందిన 90మంది పేదలకు 1976డిసెంబర్ 10న పంగులూరులో ఒక శిబిరం ఏర్పాటు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కరికి 50సెంట్లు నుండి 75సెంట్లు వరకు ప్రభుత్వ భూమిని మంజూరు చేసింది. ఆపరేషన్ చేయించుకున్న 90మందిలో 68మందికి భూములు చూపించి పట్టాలిచ్చారు. తూర్పు కొప్పెరపాడు గ్రామానికి చెందిన ఆరుగురికి, తూర్పు తక్కెలపాడు గ్రామానికి చెందిన 16మందికి కలిపి 22మందికి పట్టాలు ఇచ్చి భూములు మాత్రం ఇంతవరకు చూపించలేదు. తూర్పు కొప్పెరపాడులో ఉన్న ఆరుగురులో ఇప్పటికీ ఐదుగురు లబ్ధిదారులు మరణించారు. కుంట ఆదాము ఒక్కడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాడు. గత 46సంవత్సరాల నుండి భూముల కోసం కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇంత వరకు ఎవరు తమగోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు చూపించలేదని కుంట ఆదాం తెలిపాడు. ఈ విషయమై పేదలు తహశీల్దారు పద్మావతిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు రాయని వినోద్ బాబు మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పేదలందరికీ భూములు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చి భూములు చూపకపోవడం మోసం చేయడమేనని అన్నారు. అధికారులు పట్టాల్లో ఉన్న సర్వే నెంబర్లు ఆధారంగా ఇప్పటికైనా భూములు చూపించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తహశీల్దారు పద్మావతి మాట్లాడుతూ ఈ భూములకు సంబంధించి కోర్టుల తీర్పులు, వాటి కాపీలను అందజేస్తే వాటిని పరిశీలించి పేదలకు న్యాయం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పాలపర్తి రవి కుమార్, కుంట ఆదాం, పాలపర్తి సందీప్, వేమూరి బోసుబాబు, బెజ్జం దయానందం, పాలపర్తి సుబ్బారావు పాల్గొన్నారు.