Sep 27,2023 22:01

కలెక్టర్‌కు వినతినిస్తున్న పురిటిపెంట గ్రామానికి చెందిన రైతులు

ప్రజాశక్తి-గజపతినగరం : తాతల తండ్రుల నుంచి సాగుచేస్తున్న తమ హెచ్‌ఒ భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని పురిటిపెంట గ్రామానికి చెందిన రైతులు, గ్రామపెద్దలు అధికారులను కోరారు. చాలా కాలంగా పట్టాలు లేకపోవడం వల్ల క్రయ విక్రయాలు జరగక పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. గజపతినగరం మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండలస్థాయిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి పలు సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వినతులను ఆయా మండల స్థాయి అధికారులకు అందజేసి వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.
పురిటిపెంటకు చెందిన పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, ఉపసర్పంచ్‌ మండల సురేష్‌ నాయకత్వాన రైతులు సారికి బంగారు నాయుడు, మంత్రి సత్యనారాయణ, గొర్లె శ్రీనివాస్‌, లెంక గణేష్‌ తదితరులు తమ భూములకు పట్టాలివ్వాలని కలెక్టర్‌కు వినతినిచ్చారు. ఇది 296 మంది రైతుల సాగులో ఉన్న 265 ఎకరాలకు సంబంధించిన సమస్య అని, ఏళ్ల తరబడి పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌కు తెలిపారు. అలాగే ఆండ్ర జలాశయం నుండి ఎడమ కాలువ ద్వారా నీరు పురిటిపెంట భూములుకి రావాల్సి ఉండగా గంగ చోళ్ళ పెంట గ్రామంలో కాలువ చుట్టూ ఉన్న రైతులు కాలువను కప్పి వేయడం వలన పురిటిపెంట రైతులకు నీరు సమృద్ధిగా రావడం లేదని, సర్వే చేసి కాలువను పునరుద్దరించి సాగునీరు అందించాలని రైతులు కోరారు. గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేటు వద్ద అండర్‌ బ్రిడ్జి గాని, ఓవర్‌ బ్రిడ్జి గాని లేనందున వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి అండర్‌బ్రిడ్జిగాని, ఓవర్‌ బ్రిడ్జిగాని నిర్మించాలని కోరారు. ఇలా పలు సమస్యలపై 115వినతులు అందాయి. వాటిలో రెవిన్యూ అంశాలపై 28, ఫించన్లకోసం 34, గృహాలకు సంబంధించి 18, ప్రభుత్వ పథకాల మంజూరు కోసం 23, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలపై 6, సదరం సర్టిఫికెట్ల కోసం 3, క్లాప్‌మిత్రల సమస్యలపై 1, రైతుభరోసా కేంద్రాల బిల్లుల కోసం 1 వినతులు అందాయి.
ఈ సందర్భంగా వినతులపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. వినతుల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఆయా శాఖలకు సంబంధించిన వినతులను తమ స్థాయిలో పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిన అంశాలను క్రోడీకరించి అందజేయాలన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఎస్‌హెచ్‌ఒలతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో తరచూ సమావేశమై ఆయా సమస్యలపై చర్చించి పరిష్కరించా లన్నారు. 2019 కంటే ముందు మంజూరైన గహాలకు బిల్లుల చెల్లించాలని కోరుతూ పలు వినతులు అందాయని, వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి స్టేజ్‌ అప్‌డేషన్‌ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, ఆర్‌డిఒ శేషశైలజ, జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.