Jul 01,2023 23:52

భూమి వద్ద ధర్నా చేస్తున్న రైతులు

ప్రజాశక్తి-పద్మనాభం : పూర్వీకుల నుంచి సాగుచేసుకుంటున్న భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ పద్మనాభం మండలంలోని బర్లపేట గ్రామ రైతులు శనివారం ఆ భూముల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గ్రామానికి చెందిన సుమారు 32 మంది రైతులు పూర్వం నుంచి సర్వే నెంబర్‌ 42/1, 42/2లోని భూములను సాగు చేసుకొని జీవనం సాగించేవారమని తెలిపారు. ఈ భూమిలో తమ పూర్వీకులు మెట్ట పంటలైన చోడి, మిరప, గంటి తదితర పంటలు పండించే వారని పేర్కొన్నారు. ఈ భూములను తమ తల్లిదండ్రుల పేరుమీద ప్రభుత్వం ఇచ్చిందిని, ఈ భూమిని కాళీ చేయాలని, లేకుంటే కేసులు పెడతానని రూపాకుల రవికుమార్‌ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో కొందరు రైతులు ఎదురుతిరిగితే పోలీసు కేసులు పెట్టించి తిప్పారని, దానికి భయపడి తమ పూర్వీకులు వదులుకున్నారని తెలిపారు. సామాజిక సేవ ముసుగులో రూపాకుల రవికుమార్‌ భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి పేరు చెప్పి మోసం చేస్తున్నరన్నారు. అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి నాయ్యం చేయాలని రైతులు కోరారు. ఈ వివాదంపై సోమవారం స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని తెలిపారు.
తహశీల్దార్‌ వివరణ
బర్లపేట గ్రామంలోని సర్వే నెంబర్‌ 42/1, 42/2లో సుమారు 12 ఎకరాల భూమిని స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిందని తహశీల్దార్‌ తోట శ్రీవల్లి తెలిపారు. 42/2 సర్వే నెంబర్‌లో 2.82 ఎకరాలను రూపాకుల విశాలాక్షికి, 41/1 సర్వే నెంబర్‌లో 9.28 ఎకరాలను రూపాకుల సుబ్రమణ్యానికి 1989లో ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. ఈ భూములపై తాము పండించుకునేవారమని ఆ గ్రామ రైతులు కొందరు శుక్రవారం తనకు వినతిపత్రం ఇచ్చారని తెలిపారు.