శ్రీకలెక్టర్, ఎస్‌పిలకు పోలీసుల భార్యల వినతి
ప్రజాశక్తి - కాకినాడ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుండి రంప చోడవరం, చింతూరు సబ్ డివిజన్లలోనో అడవి ప్రాంతంలో పనిచేస్తున్న తమ భర్తలను జీవో నెంబర్ 71 ప్రకారం సొంత జిల్లాలలోకి బదిలీ చేయాలని కోరుతూ పోలీసుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు జిల్లా పోలీస్ అధికారి ఎస్ సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాలకు సోమవారం వినతి పత్రాలను సమర్పించారు. 2022లో తూర్పుగోదావరి జిల్లా... జిల్లాల విభజనలో అల్లూరి సీతారామరాజు జిల్లా నూతనంగా ఏర్పాటు అయినపుడు ఆ జిల్లాలో రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్లకు తమ పోలీస్ భర్తలను బదిలీ చేశారన్నారు. తిరిగి వారి బదిలీల గురించి పాత తూర్పుగోదావరి జిల్లాలో చేయాలని కోరామని తెలిపారు. ఇప్పుడు బదిలీల సమయంలో వారిని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని వారిగా పరిగణించి అదే జిల్లాలో బదిలీ చేస్తున్నారని ఆయా పోలీసుల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. తామొకచోట తమ భర్తలు ఒక చోట పని చేయడం వల్ల ఆర్థిక బాధలు, కుటుంబ, అనారోగ్య సమస్యలు వల్ల తాము చాలా మనోవేదనలకు గురవుతున్నామని చెప్పారు. ఏజెన్సీ అయిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండేళ్ల నుండి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని సొంత జిల్లా, కాకినాడ జిల్లాలోనూ లేదా మైదాన ప్రాంతాలలోకి బదిలీ చేయాలని కోరుతున్నారు. సోమవారం నుండి ప్రారంభించిన బదిలీలలో తమ భర్తలను సొంత జిల్లాలకు బదిలీ చేసి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని పోలీసుల భార్యలు ఎస్‌పి సతీష్ కుమార్, కలెక్టర్ కృతికా శుక్లాలను వేడుకున్నారు.
సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతున్న పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు










