Sep 17,2023 21:19

నిరసన తెలుపుతున్న బాధితులు, రైతు, వ్యవసాయ సంఘం నాయకులు

ప్రజాశక్తి- దత్తిరాజేరు : మండ లంలోని చిన్నచామలపల్లిలో నిత్యం గొర్రెలు, మేకలు మేపుకుంటున్న ప్రదేశంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి తమ బ్రతుకులను నాశనం చేయొద్దని ఆ గ్రామానికి చెందిన 150 మంది యాదవ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం కౌలు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాకోటి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సమీపంలో ఉన్న డి -పట్టా భూముల్లో గొర్రెలు, మేకలు పెంచుకొని యాదవ కుటుంబాలంతా జీవనం సాగిస్తున్నాయని ఈ భూముల్లో కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణం జరిగితే వారి జీవాలను ఎక్కడ మేపుకొని బతకాలని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామంలో సుమారు 50 కుటుంబాల వరకు జీవించలేక ఇతర రాష్ట్రాలకు వలస పోయారని, ఈ కెవికె నిర్మాణం జరిగితే మిగిలిన కుటుంబాలు కూడా ఊరి వదిలి వలస పోవాల్సి వస్తుందని ఆ గ్రామ సర్పంచ్‌ మజ్జి భారతి, స్థానిక యాదవులు నాయకులు ఎరుక నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ప్రజల కష్టాలు విని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారని యాదవులు తెలిపారు. ఉన్న 150 కుటుంబాల్లో 87 కుటుంబాలకు కనీసం సెంటు భూమి కూడా లేని నిరుపేదలని, వీరంతా కొండ సమీపంలో ఉన్న భూములను సాగు చేయించుకుంటూ బతుకుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈనెల 19వ తేదీన ఆర్‌డిఒ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. తమకు న్యాయం జరగకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతామని హెచ్చరించారు.