ప్రజాశక్తి - పెద్దాపురం : ఎల్ఐసి పరిరక్షణ కోసం,ఏజెంట్ల సమస్యలు పరిష్కారం కోసం అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్ఐసి జోనల్ కార్యాలయం వద్ద ఏజెంట్లు తలపెట్టిన ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంటర్ జోన్ జనరల్ సెక్రటరీ పి ఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో జరిగిన ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాజమండ్రి డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.రాజమండ్రి డివిజన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఎల్ఐసి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఎల్ఐసిలో ఐపిఓ ప్రవేశపెట్టి ఎల్ఐసిని ప్రైవేటుపరం చేసి బడా కార్పొరేట్లకు అప్పగించే దిశలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐపీఓ పేరుతో ఎల్ఐసి షేర్లను అమ్మచూపడం అన్యాయమన్నారు. ఎల్ఐసి మనుగడను కాపాడేందుకు,ఏజెంట్ల సమస్యలు పరిష్కరించేందుకు తలపెట్టిన ఈ జోనల్ ఆఫీసు హైదరాబాద్ ధర్నాను అందరూ విజయవంతం చేయాలన్నారు.ఈ సభలో బీమా రంగంలోని అన్ని లావాదేవీలపై జిఎస్ టి ని రద్దు చేయాలని,బీమా సుగం ఎక్సేంజ్ అమలు జరపరాదని, ఎల్ఐసి ఏజెంట్లకు గ్రాడ్యుటీ పెంచాలని,ఎల్ఐసి ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని,ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏజెంట్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని, కేరళ రాష్ట్ర ప్రభుత్వ తరహాలో ఏజెంట్లకు పింఛన్ ఇవ్వాలని, ఎల్ఐసి ఏజెంట్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, పెండింగ్ లో ఉన్న అన్ని డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భీమవరం బ్రాంచ్ కి చెందిన పి ఆర్ కె రాజును రాజమండ్రి డివిజన్ క్లియా కన్వీనర్ గా ఎంపిక చేశారు.పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్ ఏవో ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో ఏపీ స్టేట్ ఏవో ఐ ప్రెసిడెంట్ టీ కోటేశ్వరరావు,జనరల్ సెక్రెటరీ జి రవిశంకర్,డివిజన్ సెక్రటరీ కే నాగిరెడ్డి,పెద్దాపురం ఎల్ఐసి ఏ ఓ ఐ సెక్రటరీ బి వీరభద్రరావు,కోశాధికారి కె ఎస్ ఎన్ మూర్తి,జోనల్ ఈసీ మెంబర్ టి వెంకటరావు,డివిజన్ ఈసీ మెంబర్ సిహెచ్ వరప్రసాద్,లోవరాజు, లోకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.










