Apr 12,2023 23:07

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌ అబ్థుల్‌ నజీర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉందని, ఇక్కడ చదివిన వారు ఎంతో మంది దేశ, విదేశాలలో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. రానున్న కాలంలో మరింత మందిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లి చక్కటి విద్యను అందించడంలో లయోలా కళాశాల కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా కళాశాలలో నూతనంగా నిర్మించిన ప్లాటినం జూబ్లీ మెమోరియల్‌ బిల్డింగ్‌ను , కమ్యూనిటీ విలేజ్‌ బిల్దింగ్‌లను రాష్ట్ర గవర్నర్‌ ప్రారంభించారు. ప్రత్యేక అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. 1953లో లయోలా కళాశాలను ప్రారంభిం చారని అప్పటి నుండి నేటి వరకు ఉన్నత విలువలతో కూడిన విద్యాను అందించడంలో లయోలా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇంటర్‌, డిగ్రీతో పాటు పిజి కోర్సులు, ఇంజనీరింగ్‌ కోర్సులను కూడా అందిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జిఎపి కిషోర్‌ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఏవిధంగా అభివృద్ది సాధించిందో నివేదికను అందచేశారు. ఈకార్యక్రమంలో కృష్ణా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. రామమోహనరావు, విజయవాడ డయోసిస్‌ బిషప్‌ రెవరెంట్‌ డాక్టర్‌ టి.జోసఫ్‌ రాజారావు, కళాశాల మీడియా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.సహాయ భాస్కరన్‌ , పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.