Jul 27,2023 21:23

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           ల్యాండ్‌ సీలింగ్‌ భూములను పేదలకు పంపిణీ చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న రెండు లక్షల ఎకరాల ల్యాండ్‌ సీలింగ్‌ భూములను పేదలకు పంచి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ చేస్తామని చెప్పి జిల్లాలోని ల్యాండ్‌ సీలింగ్‌ ఎల్‌టిఆర్‌, పోడు భూములు, ఇలా 18 రకాల భూములను లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారన్నారు. భూస్వాముల, అధికార పార్టీ నాయకుల స్వాధీనంలో ఉన్నాయన్నారు. వాటిని వెలికితీసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఎర్ర కాలువ ల్యాండ్‌ సీలింగులు, ఏజెన్సీలో గిరిజనులు సాగు చేస్తున్న ఎల్‌టిఆర్‌ఆర్‌ పోడు భూముల కోసం, దోసపాడు దళితుల భూపోరాటం చేస్తున్నారని తెలిపారు. చింతలపూడి, లింగపాలెం ఏరియాల్లో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని వాటిని పేదలకు, గిరిజనులకు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ చట్ట సవరణకు ప్రయత్నిస్తోందని, దీన్ని విరమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి.సత్యనారాయణ, ఆర్‌.డానియేలు, ఎస్‌.మహంకాళి, టి.ముత్యాలమ్మ, ఎం.సుధారాణి, వై.సీత, జి.వెంకట్రావు, ఎ.ప్రభాకర్‌రావు, చిన్నం మాధవ, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.