ప్రజాశక్తి -తగరపువలస : ఎపి భూసంస్కరణల చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) ప్రకారం ప్రభుత్వానికి అప్పగించిన భూములను క్రయవిక్రయాలు జరపడం చట్ట వ్యతిరేకం కాదా అని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ డి పెదబాబును పలువురు ఇనాం భూసాగుదారులైన రైతులు కనకల వెంకట రమణ, కాళ్ళ ఆదినారాయణ, కె.పోలినాయుడు, సన్యాసి నాయుడు, అల్లు చిన్నయ్య తదితరులు ప్రశ్నించారు. స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్.అప్పలనాయుడుతో కలిసి శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి రైతుల సాగులో ఉన్న భూములను అమ్మకాలు జరపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికార బలాన్ని ఉపయోగించి తనకు అనుకూలంగా అతని కుటుంబ సభ్యులు, మరి కొందరు బి నామీల పేర్లను ఎస్‌ఎఫ్‌ఎలో నమోదు చేయించడం ఏ విధమైన పెద్దరికమన్నారు. నారాయణరాజుపేటలో ఇనాం భూములు వందేళ్లు గా తనకు దఖలు పడ్డాయని చెబుతున్న ఆయన ఆయా భూములను ఏనాడైనా సాగు చేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. మజ్జివలస రెవెన్యూ గ్రామంలో కొన్ని ఎకరాల గ్రామ కంఠం భూమిని ఆయన అనుభవించార ని ఆరోపించారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న ఇనాం భూములను సాగుదారులైన తమకే చెందాలని, లేకుంటే ఆత్మ హత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులకు న్యాయం చేయాలి : సిపిఎం
ఇనాం భూ సాగుదారులైన రైతులకు న్యాయం చేయాలని సిపిఎం స్థానిక నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్.అప్పల నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులతో కలిసి వారు మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని రైతుల పక్షాన నిలవాలని కోరారు.










