Feb 16,2023 00:15

పెద ముషిడివాడలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు

బ పట్టణ పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల సమీకరణ
బ భూముల కోల్పోయిన వారికి నాడిచ్చిన హామీలు గాలికి
బ నేటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించని వైనం
బ ఐదు రోజులుగా బాధితుల ఆందోళన
ప్రజాశక్తి-పరవాడ

పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో దళిత, వెనుకబడిన తరగతుల పేదలను ప్రభుత్వం ఫూల్‌ చేసింది. తోటలు, పంటలు సాగుచేసుకొని హాయిగా జీవిస్తున్న పేదల నుంచి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, నాడు వారికి ఇస్తామన్న అభివృద్ధి చేసిన ప్లాట్లు నేటికీ ఇవ్వలేదు. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
పరవాడ మండలం పెదముషిడివాడ రెవెన్యూ పరిధిలోని దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన పేదలకు గతంలో ప్రభుత్వం అసైన్‌మెంట్‌ పట్టా భూములను ఇచ్చింది. వీరు ఈ భూములను సాగు చేసుకొని జీవనోపాధి పొందేవారు. మరికొంత మంది పేదలు ప్రభుత్వ భూములను సాగుచేసుకొని జీవనం సాగించేవారు. వైసిపి ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కోసం ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో దళిత, వెనుకబడిన తరగతుల పేదలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా పెదముషిడివాడ రెవెన్యూలో 13, 63, 76, 367, 432, 450 సర్వే నెంబర్లలో 300 ఎకరాల పైనే భూమిని తీసుకుంది. వీటిలో 200 మంది దళితులకు చెందిన 260 ఎకరాలు, 75 మంది వెనుకబడిన తరగతులకు చెందిన 40 ఎకరాలు, మరో 30 ఎకరాలు మాజీ సైనికుల భూములు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ఎకరానికి డి.పట్టా ఉన్నవారికి 900 గజాలు, డి.పట్టా లేకుండా సాగులో ఉన్న వారికి 450 గజాలు చొప్పున భూమిని అభివృద్ధి చేసి, వుడా అప్రూవల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసి ప్లాట్లు ఇస్తామని 2019-20 సంవత్సరంలో ప్రభుత్వం తరపున నాటి అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఇలా తీసుకున్న భూముల్లో ప్లాట్లు వేసి పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. కాని భూములిచ్చిన పేద దళిత, వెనుకబడిన తరగతుల రైతులకు నేటికీ ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు అప్పగించలేదు.
దీంతో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీల్లో చేస్తున్న నిర్మాణాలను బాధిత రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డి-పట్టా భూమి ఎకరానికి 900 గజాలు, సాగులో ఉన్నవారికి ఎకరానికి 450 గజాలు చొప్పున అభివృద్ధి చేసి, వుడా అప్రూవల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాతే జగనన్న ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని, అంతవరకు పనులు చేయరాదని బాధిత రైతులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో అప్పటి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక వైపు రైతులకు ఇచ్చిన హామీను నెరవేర్చకపోగా, మరో వైపు పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీను నెరవేర్చే విధంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

త్వరలో పట్టాలిస్తాం : తహశీల్దారు
దీనిపై పరవాడ తహశీల్దార్‌ వి.ప్రకాశరావును ప్రజాశక్తి వివరణ కోరగా పెదముషిడివాడ రెవెన్యూలో ప్రభుత్వం సేకరించిన ల్యాండ్‌ పూలింగ్‌లో 133 మంది రైతులను అర్హులుగా గుర్తించామని, వారికి త్వరలోనే పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు.