ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలో ల్యాండ్ పూలింగ్ జిఒ 72ను రద్దుచేయాలని, పేదల భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని కోరుతూ ఆనందపురం మండలం రీ సర్వే డీటీకి సిపిఎం నాయకులు వినతిపత్రం అందించారు. ఆనందపురం మండలం ముకుందపురంలో 72 ఎకరాలు, శోంఠ్యాంలో 239 ఎకరాలు, కుసులవాడలో 66.64 ఎకరాలు, బాకూరుపాలెంలో 20.65 ఎకరాలు, జగన్నాధపురంలో మూడు ఎకరాలు మొత్తంగా సుమారు 400 ఎకరాల భూమిని జిఒ 72 ద్వారా ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను గుంజుకొని అధికార పార్టీ నాయకుల బినామీలకు కట్టబెట్టాలనుకోవడం అన్యాయం అని సిపిఎం జోనల్ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి వివరించారు. ఈ చర్యలను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఎక్కడైనా పేదలు సాగుచేస్తున్న భూములకు రికార్డులలో సాగు హక్కు లిఖించి రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పేదలు, దళితులు చట్ట ప్రకారం ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూములను సాగు చేసుకుని జీవనం సాగించే హక్కు ఉందని తెలిపారు. సాగులో ఉన్న రైతులను వెల్లగొట్టి, వ్యవసాయానికి దూరం చేయడం నేటి పాలకుల తీరు ఉందని విమర్శించారు. దళితులు ఆ భూములను సాగు చేసుకుని జీవిస్తున్నారని, వారికి ఆ భూమి తప్ప వేరే జీవనాధారం లేదని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన జిఒ 72ను తక్షణం రద్దు చేయాలని, ఆనందపురం మండలంలో పై గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌ను శాశ్వతంగా నిలుపుదల చేయాలని డిమాండ్‌చేశారు. సాగు చేస్తున్న రైతుల పేర్లను రికార్డులో ఎక్కించి హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే పేద రైతులను ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినతి ఇచ్చిన వారిలో పార్టీ జోన్ కమిటీ సభ్యులు కె.నాగరాణి, రవ్వ నర్సింగరావు ఉన్నారు.










