May 11,2023 23:37

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న అఖిలపక్ష నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి మండలంలో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 15న ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అనకాపల్లి అఖిలపక్ష పార్టీల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరప్రతాలను గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిఒ 72 తీసుకొచ్చి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సుమారు 1100 ఎకరాల డి.ఫారం భూములను పేదల నుండి లాక్కుందని తెలిపారు. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇవ్వకుండా దొంగనాటకాలు ఆడుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో నిరసన దీక్షలు చేశామని, అయినా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 15న ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఐఆర్‌.గంగాధర్‌, దాసరి సంతోష్‌, టి.సంతోష్‌, సిపిఐ నాయకులు వైఎన్‌.భద్రం, సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాథబాబు తదితరులు పాల్గొన్నారు.