Apr 17,2023 23:59

భూ సమస్యపై కలెక్టర్‌కు వివరిస్తున్న మాజీ ఎంపీపీ గోపీబాబు

ప్రజాశక్తి-పద్మనాభం : ల్యాండ్‌ పూలింగ్‌ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, విచారణ అధికారులను మార్చాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్‌కు సోమవారం స్పందనలో పద్మనాభం మండలం తునివలస, నర్సాపురం, కొవ్వాడ, నారాయణపురం, అలమండ, గంధవరం, అనంతవరం గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు ఫిర్యాదు చేశారు. సుమారు 50 సంవత్సరాలుగా ఆ భూములపై ఆధారపడి బతుకుతున్నామని, 2020లో జగనన్న కాలనీల కరోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టి తమ భూములను తీసుకున్నారని తెలిపారు. అప్పటిలో రైతులను సమావేశపర్చి డి-ఫారం పట్టాలున్న వారికి ఎకరానికి 900 గజాలు, అక్రమణదారులకు 450 గజాల భూమిని ఇస్తామని చెప్పారని వివరించారు. ఆ మాటలు నమ్మి తామంతా ఆంగీకరించామని తెలిపారు. అప్పటి అధికారి బదిలీ కావడంతో విఆర్‌ఒ, సచివాలయ సర్వేయర్‌ వారికి నచ్చిన వారి పేరున మార్పులు చేసి తమకు అన్యాయం చేశారని వివరించారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో విఆర్‌ఒ, సర్వేయర్లు తమ భూములకు తప్పుడు కొలతలు వేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. తమ భూములకు అనుకొని ఉన్న గంధవరం ప్రస్తుత సర్పంచ్‌, వారి కుటుంబ సభ్యులకు విలువైన లే-అవుట్‌గా ఉన్న తునివలసలో రోడ్డు పక్కన స్థలం కేటాయించారని పేర్కొన్నారు. గంధవరం రెవెన్యూ భూములు కోల్పోయి మిగతా రైతులందరికీ డి-పట్టా ఉన్న అక్యూపేషన్‌ కింద గ్రామానికి దూరంగా రెడ్డిపల్లి లే-అవుట్‌లో కేటాయించారని తెలిపారు. అనంతవరం గ్రామ సర్పంచ్‌గా ఉన్న గోర్రిపాటి వెంకటలక్ష్మికి గంధవరం రెవెన్యూలో 260 సర్వే నెంబరులో భూమి లేకపోయినా 742 గజాలును రెడ్డిపల్లి లే-అవుట్‌లో ఇచ్చారని ఆరోపించారు. అప్పటి నుంచి అధికారులను మార్చకపోవడంతో వారికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని వివరించారు. దీనిపై తగు న్యాయం చేయాలని కోరారు.