Aug 16,2023 21:15

       జంగారెడ్డిగూడెం:జంగారెడ్డిగూడెం పరిసరాల్లో జరుగుతున్న ల్యాండ్‌ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతి తెలిపారు. బుధవారం ఆమె ముందుగా లక్కవరం పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. నేరాల అదుపు చేయడానికి పోలీస్‌ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం జంగారెడ్డిగూడెం స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్‌పి ఎం.ధనుంజయుడు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పోలీస్‌ సిబ్బంది గౌరవవందనం తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లో పలుదస్త్రాలు పరిశీలించినట్లు చెప్పారు. పట్టణంలో జరుగుతున్న ల్యాండ్‌ మాఫియాపై ఇప్పటికే పలు ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ల్యాండ్‌ మాఫియాపైగట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌, స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఉద్యోగాలిప్పిస్తామని కొంతమంది నిరుద్యోగ యువత డబ్బు వసూలు చేస్తోందని, వారిపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు బుట్టాయగూడెం మండలం దొరమామిడి పంచాయతీ కొత్త సరుగుడు కాలనీలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.