Jul 24,2021 15:54

ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఓ కుటుంబం తమ 28 ఏళ్ల కుమార్తెను ఓముస్లిం మతస్తునికిచ్చి హిందూ సాంప్రదాయంలో వివాహం చేయడాన్ని 'లవ్‌జిహాద్‌' పేర్కొంటూ అదే కమ్యూనిటీ సభ్యులు, బంధువులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అంటే గురువారం ఆ జంట ఒక్కటై...ఇప్పుడు వార్తల్లో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే...నాసిక్‌లోని ప్రముఖ జ్యుయలర్లీ వ్యాపారి ప్రసాద్‌ అద్గావ్కర్‌ దంపతులు ఈ నెల 18న తన కుమార్తె రషికను వివాహం చేయాలని భావించి...పెళ్లి శుభలేఖలు పంచారు. అప్పటి వరకు హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దానికి కారణం పెళ్లి కుమారుడు ఆసిఫ్‌ ఖాన్‌ ముస్లిం కావడం. అయితే దీనికి సంబంధించిన కాపీ...పలు వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఇది లవ్‌ జిహాద్‌ అంటూ మెసేజ్‌లు, కాల్స్‌ మీద కాల్స్‌, తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు రావడంతో పెళ్లిని ఆపేశారు. ఈ విషయం మీడియా దృష్టికి వెళ్లింది. దీంతో స్వయానా రాష్ట్ర మంత్రి బచ్చు కాడు జోక్యం చేసుకుని రషిక- ఆసిఫా వివాహానికి మద్దతు తెలిపారు. కొన్ని సంస్థలతో పాటు రాజకీయ నేతలు కూడా సపోర్ట్‌ చేయడంతో ఈ జంట గురువారం ఒక్కటైంది. ఇరు మతాల సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అంతకముందు ఈ వివాహంపై ప్రతికూలత వ్యక్తం చేసిన వ్యక్తులే..తర్వాత వాస్తవం తెలుసుకుని మద్దతునిచ్చారని, లవ్‌జిహాద్‌, బలవంతపు మత మార్పిడి కాదని, సోషల్‌ మీడియాలో పేర్కొంటుందంతా తప్పని తెలుసుకున్న వారు ...ఇప్పుడు అర్థం చేసుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి ప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు.