సమావేశంలో మాట్లాడుతున్న సురేష్ బాబు
ప్రజాశక్తి - దేవనకొండ
గ్రామాల్లో లూజు, నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే సీడ్స్ డీలర్ల లైసెన్స్ రద్దు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పత్తికొండ వ్యవసాయ సహాయ సంచాలకులు మోహన్ విజరు కుమార్, ఎఒ సురేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక సిఎల్‌ఆర్‌సి భవనంలో సీడ్స్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విత్తనాలు అమ్మిన తర్వాత రైతుకు తప్పక రసీదు ఇవ్వాలన్నారు. పత్తి, మిరప విత్తనాలు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే ఆ డీలర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్‌కు విడిగా రసీదు బుక్స్, స్టాక్ రిజిస్టర్లు పెట్టాలని సూచించారు. ఎఇఒ జయరాం, వివిధ గ్రామాల డీలర్లు పాల్గొన్నారు.










