ఏడు నెలలుగా అందని జీతాలు
12 నెలలు పని.. పది నెలలకే జీతాలు
ఎప్పుడో నిర్ణయించిన రూ.10,500 జీతమే ఇప్పటికీ
ప్రతినెలా జీతాలిచ్చేలా చర్యలు శూన్యం
సాగునీటి పంపిణీలో లస్కర్లదే కీలకపాత్ర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
జిల్లా వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న లస్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిపాటు పని చేయించుకుని పది నెలలకే జీతాలివ్వడంతోపాటు సకాలంలో జీతాలివ్వకపోవడం వంటి కారణాలతో లస్కర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. తమకు ప్రతినెలా జీతాలు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు జీతాలు పెంచాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ లస్కర్లు కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెల్టా పరిధిలో 5.29 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు ఉంది. గోదావరి నుంచి ప్రధాన కాలువల ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా సాగుతోంది. ఈ నీటిని సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత లస్కర్లపైనే ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 197 మంది లస్కర్లు పని చేస్తున్నారు. మొత్తం ధవళేశ్వరం డివిజన్ పరిధిలో 600 మంది వరకూ పని చేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. జూన్ నుంచి మార్చి నెలాఖరు వరకూ పది నెలలు పని చేసే ప్రాతిపదికన వీరిని తీసుకుంటారు. అయితే పంట కాలువలు మూసేసరికి ప్రతియేటా ఏప్రిల్ నెలాఖరవుతోంది. మెయింటినెన్స్ వంటి కారణాలతో మే నెలలోనూ వీరితో అధికారులు పని చేయించుకుంటున్నారు. జీతం మాత్రం జూన్ నుంచి మార్చి వరకూ పది నెలలకు మాత్రమే ఇస్తున్నారు. ఎప్పుడో ఏళ్ల కిందట నిర్ణయించిన రూ.10,500 జీతాన్నే ఇప్పటికీ ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెద్దఎత్తున పెరిగినా లస్కర్ల జీతాల్లో మాత్రం పెంపు లేకుండాపోయింది. రెగ్యులర్ లస్కర్లకు రూ.50 వేలకుపైగా జీతాలుండగా అదేస్థాయిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న లస్కర్లకు మాత్రం అందులో సగం జీతం కూడా ఇవ్వని పరిస్థితి.
రబీ సీజన్‌లో కష్టాలు వర్ణనాతీతం
ప్రతియేటా రబీ సీజన్‌లో సాగునీటి కొరత వెంటాడుతూనే ఉంది. సాగునీటి కొరత కారణంగా వంతులవారీ విధానం అమలు చేసి ప్రభుత్వం పంటను గట్టెక్కిస్తోంది. రబీలో సాగునీటి పంపిణీ వ్యవహారం కత్తిమీద సాములా మారుతోంది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకూ వంతులవారీగా నీటిని విడుదల చేసి సక్రమంగా జరుగుతుందా.. లేదా అని చూసే బాధ్యత లస్కర్లపైనే ఉంటుంది. ప్రతిరోజూ తక్కువగా లెక్కించినా కాలువల వెంట 20 నుంచి 30 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజూ కష్టపడాలి. రబీ సీజన్‌లో అటు రైతుల నుంచి, ఇటు అధికారుల నుంచి లస్కర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా కాలువల వెంట తిరిగి సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలి. వ్యవసాయ సాగులో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న లస్కర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వకపోవడం దారుణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రతినెలా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లస్కర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రభుత్వంగాని, అధికారులుగాని పట్టించుకోవడం లేదు. ఒక్కో లస్కర్‌కు ఏడు నెలల జీతం రూ.73 వేలకుపైగా రావాల్సి ఉంది. ప్రతియేటా సాగునీటి సలహా మండలి సమావేశంలోనూ లస్కర్ల జీతాలపై చర్చ జరగడం, మళ్లీ అదే సమస్య పునరావృతం కావడం పరిపాటిగా మారింది. ఈ నెలాఖరునగాని, వచ్చే నెలలోగాని జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జరిగే అవకాశం ఉంది. లస్కర్ల సమస్య మళ్లీ తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా లస్కర్ల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.










